చిన్నమ్మ ముహూర్తం పెట్టుకున్నా..!

7 Feb, 2017 09:22 IST|Sakshi
చిన్నమ్మ ముహూర్తం పెట్టుకున్నా..!
జయలలితకు అనునిత్యం నీడలా వెన్నంటి ఉంటూ.. ఆమె మరణం తర్వాత కూడా అంతా తానై వ్యవహరించిన చిన్నమ్మ శశికళకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నక్షత్రం, జాతకాలను బట్టి మంగళవారం ఉదయం 8.45-9.30 మధ్యలో ప్రమాణస్వీకారం చేయించాలని ముందు అనుకున్నారు. ఇందుకోసం మద్రాస్ యూనివర్సిటీలో భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిపోయి అక్కడే ఉండిపోయారు. ఆయన చెన్నై రాకపోవడంతో ఇక ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో చిన్నమ్మ శశికళ ప్రమాణాన్ని వాయిదా వేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది.  (చదవండి: శశికళ ప్రమాణంపై సందిగ్ధత)
 
ఒకవైపు సెంథిల్ కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడంతో పాటు జయలలిత-శశికళ మీద ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం లాంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ న్యాయసలహాకు వెళ్లారు. ఒకవైపు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామాను ఆమోదించిన గవర్నర్, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, సొలిసిటర్ జనరల్ తదితరులను కలివారు. వాళ్ల సలహా తీసుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు హడావుడిగా ప్రమాణస్వీకారం చేయించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వచ్చి, శిక్ష పడితే ఆమె వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుందని.. అది అంత మంచి పరిణామం కాదు కాబట్టి కొన్నాళ్లు వేచి ఉంటేనే మంచిదని సూచించారంటున్నారు. దాంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో గవర్నర్ విద్యాసాగర్‌ రావు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిపోయారు. 
 
ఢిల్లీకి స్టాలిన్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్
ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ప్రతిపక్ష డీఎంకే కూడా వేగంగా పావులు కదుపుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ హుటాహుటిన బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఉన్నందున రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున శశికళకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకూడదని కూడా ఆయన అంటున్నారు.