127 మందిపై అత్యాచారానికి తెగబడ్డారు ..

15 May, 2015 10:17 IST|Sakshi
127 మందిపై అత్యాచారానికి తెగబడ్డారు ..

డాకర్, సెనగల్ : ఇళ్లపై దాడి చేశారు. ఆపై ఇంటిలోని సామాన్లను లూటీ చేశారు. అక్కడితో ఆగకుండా మహిళలపై 60 మంది ఆర్మీ మిలిషియా అత్యాచారానికి తెగబడ్డారు. ఒకరు, ఇద్దరు కాదు... ఏకంగా 127 మంది మహిళలపై అత్యాచారం చేశారు. ఈ దారుణమైన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన తూర్పు కాంగోలోని దక్షిణ కీవ్ ప్రావెన్స్లో మే మొదటి వారంలో చోటు చేసుకుందని డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ అనే స్వచ్ఛంద సంస్థ గురువారం వెల్లడించింది. అత్యాచారానికి గురైన మహిళల్లో 14 నుంచి 70 ఏళ్ల వృద్ధులు ఉన్నారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై చాలా మంది మహిళలు బయటకు వచ్చి చెప్పేందుకు జంకుతారని, అయితే  వైద్య సహాయం కోసం ఆతృతగా ఎదురు చూశారని చెప్పారు. వారందరికి వైద్య సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా తూర్పు కాంగోలో మహిళలపై ఆర్మీ మిలిషియా సభ్యులు చేస్తున్న అత్యాచారాలకు అంతుపొంతు లేకుండా పోయిందని డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ సంస్థ పేర్కొంది. ఓ విధంగా చెప్పాలంటే అత్యాచారం అనేది ఆర్మీ మిలిషియా సభ్యులకు అత్యంత పాశవికమైన ఆయుధంగా తయారైందని అభిప్రాయపడింది.

కాంగోలో అత్యాచారాలను నిరోధించేందుకు చేసిన తీర్మానంపై ఆర్మీ కమాండర్స్ సంతకాలు చేసిన... మహిళలపై జరుగుతున్న దురాగతాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగోతోపాటు దాదాపు 18  దేశాలలో ఇలాంటి ఆఘాయిత్యాలు జరుగుతున్నాయని యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు