విమాన సిబ్బందే స్మగ్లర్లు!

2 Nov, 2015 10:25 IST|Sakshi
విమాన సిబ్బందే స్మగ్లర్లు!

- నిషేధిత కాఫ్ సిరప్ను స్మగ్ల్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ

 

న్యూఢిల్లీ/లండన్: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి పతాక శీర్షికలకెక్కింది. రాకపోకల్లో ఆలస్యం, సిబ్బంది అలసత్వం, అక్రమరవాణా ఆరోపణలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఎయిర్ ఇండియాను తాజాగా కాఫ్ సిరప్(దగ్గుమందు) స్మగ్లింగ్ ఉదంతం కుదిపేసింది. సాక్షాత్తూ విమాన సిబ్బందే భారీ స్థాయిలో కాఫ్ సిరప్ (బెనడ్రిల్)ను స్మగ్ల్ చేస్తూ పట్టుబడ్డారు.

ఢిల్లీ నుంచి లండన్ వెళుతోన్న విమానం నుంచి 450 బాటిళ్ల కాఫ్ సిరప్ (బెనడ్రిల్)ను స్వాధీనం చేసుకున్న లండన్ కస్టమ్స్ అధికారులు.. తదుపరి దర్యాప్తు నిమిత్తం విమాన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నెల రోజుల కిందట జరిగిన ఈ ఉదంతాన్ని ఎయిర్ ఇండియా అధికారులు దాచిపెట్టినప్పటికీ చివరికి బట్టబయలైంది. దీంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థింబోమని, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి మహేశ్ శర్మ ప్రకటించారు.

బెనిడ్రల్ సహా వివిధ కంపెనీల కాఫ్ సిరప్లు భారత్లో యథేచ్ఛగా అమ్ముతారు. కానీ లండన్ సిటీ సహా యునైటెడ్ కింగ్ డమ్ అంతటా ఈ మందుపై నిషేధం ఉంది. ఎక్కువ మోతాదులో కాఫ్ సిరప్ను తాగితే.. మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వాడినప్పుడు కలిగే అనుభూతి ఉంటుందని నిర్థారణ కావడంతోనే అక్కడి ప్రభుత్వాలు దగ్గు టానిక్లను నిషేధించాయి. కాఫ్ సిరప్ను డ్రగ్గా ఉపయోగించిన ఉదంతాలు ఇటీవల హైదరాబాద్లోనూ వెలుగులోకి రావటం గమనార్హం.

యూకేలో డిమాండ్ దృష్ట్యా భారీ స్థాయిలో కాఫ్ సిరప్ అక్రమరవాణా అవుతోంది. లండన్కు సరఫరా అవుతోన్న సిరప్ లో అధిక శాతం విమానల ద్వారా స్మగ్ల్ అవుతున్నట్లు, ఇందులో మహిళా సిబ్బంది పాత్రకూడా ఉన్నట్లు తెలిసింది. ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది తమ లగేజీల్లో బంగారం, నిషేధిత ట్యాబ్లెట్లు తదితర వస్తువులతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు