ఎయిరిండియా సిబ్బందికి కక్కుర్తి ఎక్కువట!

8 Feb, 2017 08:26 IST|Sakshi
ఎయిరిండియా సిబ్బందికి కక్కుర్తి ఎక్కువట!
ఎయిర్ ఇండియా.. భారతదేశం గర్వంగా చెప్పుకొనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ. అయితే ఇందులో సిబ్బంది చేతివాటం కారణంగా సంస్థకు తలవంపులు వస్తున్నాయి. ఎయిరిండియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్లు తమ హోటల్లో బఫే టేబుల్ మీద మాత్రమే తినాల్సిన ఆహార పదార్థాలను బాక్సులలో పెట్టుకుని తీసుకుపోతున్నారని లండన్‌కు చెందిన ఓ ప్రముఖ హోటల్ ఫిర్యాదు చేసింది. దాంతో ఎయిరిండియా తమ సిబ్బంది అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. 'బఫే అంటే తీసుకెళ్లేది కాదు' అనే శీర్షికతో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) ఈ నోటీసు పంపారు. అందులో, ''మాకు లండన్‌లోని ఒక హోటల్ యాజమాన్యం నుంచి దురదృష్టకరమైన ఈమెయిల్ వచ్చింది. కొంతమంది ఎయిరిండియా సిబ్బంది తరచు తమ హోటల్‌కు ఖాళీ బాక్సులు తెచ్చి, వాటిలో బఫేలో ఉంచిన ఆహార పదార్థాలు తీసుకెళ్లిపోతున్నట్లు చెప్పారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇలా చేస్తున్నారని మాకు తెలుసు గానీ, ఒకరిద్దరైనా అలా చేయడం పరువు తక్కువ. కొద్దిమంది తమ కక్కుర్తి పనులతో సంస్థ పరుపు ప్రతిష్ఠలను మంటగలపొద్దు'' అని ఆ నోటీసులో పేర్కొన్నారు. మొదట్లో లండన్ నుంచి వచ్చిన లేఖను ఫేక్ అనుకున్నామని, కానీ తర్వాత ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పారు. 
 
అయితే కేవలం 15 రోజుల క్రితమే ఏజీఎంగా ప్రమోషన్ వచ్చిన మహిళ ఈ రకంగా నోటీసు పంపడాన్ని సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి సంస్థలోనూ కొంతమంది చేతివాటం ఉన్నవాళ్లు ఉంటారని, కేవలం కేబిన్ క్రూలో మాత్రమే కాదని ఒక సీనియర్ కేబిన్ సిబ్బంది చెప్పారు. ఇక్కడినుంచి లండన్ వెళ్లే విమానంలో తాము 14-15 గంటలు ప్రయాణం చేసి ఉదయం 7.30 లేదా సాయంత్రం 6.30 గంటలకు వెళ్తామని, అప్పటికి బాగా అలిసిపోయి ఉంటామని అన్నారు. ఇంతకుముందు రెండు రోజుల విశ్రాంతి ఉండేదని, ఇప్పుడు కేవలం 26 గంటలే ఉండటంతో తర్వాతిరోజు విమానంలో పని చేయడానికి విశ్రాంతి తీసుకుంటామని, సిబ్బందిలో కేవలం ఒకరిద్దరు మాత్రమే అలా బాక్సులు తెచ్చుకుని తర్వాత తినడానికి తీసుకుంటారని అన్నారు. రెగ్యులర్ సిబ్బంది కంటే కాంట్రాక్టు సిబ్బందికి 60% జీతాలు తక్కువగా ఉంటాయని, అలాంటివాళ్లు లండన్ లాంటి చోట్ల ఎక్కువ ఖరీదు ఉండే హోటళ్లలో తినడం కష్టమని వివరించారు. పైగా ఆ హోటల్లో రూమ్ సర్వీస్ ఉచితం కాదని, దానికి పది పౌండ్లు అదనంగా వసూలు చేస్తారని చెప్పారు. పైగా మెనూలో కేవలం శాండ్‌విచ్‌ల లాంటి పదార్థాలు మాత్రమే ఉంటాయని, ప్రతిసారీ భోజనంలో వాటిని తినడం భారతీయులకు కష్టమని చెప్పారు.
మరిన్ని వార్తలు