అమెరికాకు త్వరగా వెళ్లాలంటే..

28 Aug, 2016 22:04 IST|Sakshi
అమెరికాకు త్వరగా వెళ్లాలంటే..

న్యూఢిల్లీ: ఇండియా నుంచి అమెరికాకు విమానయానంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రస్తుత ప్రయాణ సమయం కంటే మూడు గంటలు త్వరగా వెళ్లొచ్చు. ఎలాగంటే..భారత రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి వెళ్లే ఎయిర్‌ఇండియా విమానాలు త్వరలోనే కొత్తదారిలో ప్రయాణించనున్నాయి. ఢిల్లీ నుంచి తూర్పుదిశగా ఎగరనున్న విమానాలు ఫసిఫిక్ మహాసముద్రం మీద నుంచి అగ్రరాజ్యానికి చేరుకోనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే అన్ని ఎయిర్ ఇండియా విమానాలు టేకాఫ్ అయిన తర్వాత పశ్చిమదిశగా అట్లాంటిక్ మహాసముద్రం మీదనుంచి వెళుతున్నాయి. ఇంధనం ఆదాపై దృష్టి సారించిన ఏఐ ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి కూడా ఆమోదం లభించింది.

విమానాలు ఢిల్లీ నుంచి తూర్పుదిశకు (పసిఫిక్ వైపుకు) వెళ్లడం వల్ల అమెరికాకు దూరం 1,400 కి.మీ పెరుగుతుంది. అయితే పసిఫిక్ ప్రాంతంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా ఇంధనం, ప్రయాణ సమయం కలిసివస్తాయని అధికారులు చెబుతున్నారు. విమానాలు ఢిల్లీ నుంచి పశ్చిమ దిశలో (అట్లాంటిక్ మీదుగా) ప్రయాణించినప్పుడు.. ఎదురుగాలి బలంగా వీస్తుందని, కొన్నిసార్లు గంటకు 24 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. అంటే విమాన వేగం గంటకు 800 కిలోమీటర్లు అనుకుంటే వాస్తవేగం మాత్రం 776 కిలోమీటర్లే ఉంటుందని, ఈ కారణంగా ఇంధన వినియోగం అధికంగా ఉంటుందని.. మొత్తంగా ఎక్కువ ఖర్చవుతుందని అధికారులు చెప్పారు.

అదే తూర్పుదిశగా( పసిఫిక్ మీదుగా) వెళ్లేటప్పుడు..  గాలులు విమానం ప్రయాణించే దిశలోనే గంటకు 138 కి.మీ వేగంతో వీస్తాయని, విమానం గంటలకు 800 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందనుకుంటే వాస్తవవేగం గంటకు 938 కి.మీ ఉంటుంది’  అని సీనియర్ పైలట్ ఒకరు చెప్పారు. పాత మార్గంతో పోలిస్తే కొత్త దారిలో గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చని,  వేసవిలో అయితే ఒక గంట ముందు, శీతాకాలంలో అయితే మూడు గంటల ముందుగానే శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకోవచ్చుని తెలిపారు.

ప్రస్తుతం ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య నడపడానికి బోయింగ్ 777-200 ఎల్‌ఆర్ విమానాన్ని ఎయిర్ ఇండియా వాడుతోంది. ఈ విమానం గాలిలో ఎగరడానికి గంటకు 9,600 లీటర్ల ఇంధనం అవసరం. పసిఫిక్ మీదుగా వెళ్తామన్న ఎయిర్ ఇండియా ప్రతిపాదనకు డీజీసీఏ (డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. నవంబరు నుంచి విమానాలు కొత్త మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో మార్గంలో ఎయిర్‌ఇండియా ప్రస్తుతం మూడు విమానాలు నడుపుతుండగా, నవంబరు నుంచి ఈ సంఖ్యను ఆరుకు పెంచనుంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా