మీ చేతులకు రక్తం అంటుకుంది

6 Mar, 2016 08:22 IST|Sakshi
మీ చేతులకు రక్తం అంటుకుంది

కింగ్’ ఫిషర్ మాల్యాకు ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల లేఖ
బెంగళూరు: వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్యాపై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధతో, ఆక్రోశంతో లేఖ రాశారు. మాల్యా హృదయం మలినమైందని, చేతులకు ఉద్యోగుల రక్తం అంటుకుందంటూ తీవ్రంగా స్పందించారు.
 
లేఖలోని ముఖ్యాంశాలు ఉద్యోగుల మాటల్లోనే:
మిస్టర్ మాల్యా!..కింగ్‌ఫిషర్ ఉద్యోగులుగానే కాకుండా పన్ను కడుతున్న ఈ దేశ పౌరులుగా ఈ ఉత్తరం మీకు రాస్తున్నాం.
* మీరు మా పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యంతో మేం తీవ్రమైన బాధ, ఆక్రోశంలో ఉన్నాం.  కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్(కేఎఫ్‌ఏ) గురించి మాట్లాడుతూ ‘ఎలాంటి విచారం’ లేదన్న మీ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధించాయి.
* మా వరకు మాకు కేఎఫ్‌ఏ ఇంకా ఉనికిలోనే ఉంది. జీతాలు చెల్లించకపోయినా జీతాల పట్టిలో మా పేర్లు ఉన్నాయి.
* సంస్థను మళ్లీ ప్రారంభిస్తామని మీరు హామీ ఇచ్చినా.. మీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.
* దేశంలోని కుళ్లిన వ్యవస్థ గురించి మాకు తక్కువ తెలుసు... కానీ మీలాంటి వ్యక్తుల పుణ్యమాఅని దేశంలో ఉన్న అసలు పరిస్థితి ఎంత నిస్సహాయంగా ఉందో అర్థమైంది. అది సామాన్యమానవుడికి ఆత్మహత్యాసదృశంగా మారింది. ఆ సామాన్యుడు నిజాయతీగా, క్రమం తప్పకుండా చెల్లించే పన్నులను మీ లాంటివాళ్లు, రాజకీయ నాయకులు బ్యాంకులతో కుమ్మక్కై దోచుకుంటున్నారు.
* సీబీఐ ఇచ్చిన అన్ని సలహాల పట్ల బ్యాంకులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించాయో విస్మయం కలిగిస్తోంది.  అవినీతికి పాల్పడ్డ బ్యాంకర్లపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు.
* సొంతంగా చర్యలు తీసుకోవడంలో సీబీఐ అంత బలహీనంగా ఉందా?  ఎందుకు మీపై క్రిమినల్ చర్యలు తీసుకోలేదు?
* ఎందుకు సాధారణ పౌరుడే ఆదాయపు పన్ను శాఖకు భయపడాలి.?
* పన్నులు చెల్లించే వారిని అపహాస్యం చేయటం కోసమేనా ఎస్‌బీఐ ఇంత ఆలస్యంగా తీవ్రస్థాయిలో స్పందించింది?
* పన్ను చెల్లించేవారి విషయంలో ప్రభుత్వం ఎందుకు జవాబుదారీగా ఉండదు?
* మా ప్రశ్నలకు ఆర్థిక శాఖ, పీఎంఓ జవాబులు చెప్పాలి. పన్నుచెల్లింపుదారులకు ఈ వ్యవస్థపై తిరిగి విశ్వాసం పాదుకొల్పాలి.
* మీలాంటివారు మా డబ్బుతో కంపెనీ పెట్టి దోపిడీచేసి సిగ్గులేకుండా మూసేస్తున్నారు.
* ‘జీతాలు చెల్లించేందుకు నా దగ్గర డబ్బులేదన్న’ మీ మాటలకు అర్థం ఏమిటి? కరేబియన్ ప్రీమియర్ లీగ్, విలాసవంతమైన పడవ కోసం డబ్బులెక్కడి నుంచి తెచ్చి ఖర్చుపెట్టారు?
* ఈ కుళ్లిన వ్యవస్థలోని బ్యాంకులు, దర్యాప్తు సంస్థలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, పోలీసులు, మీడియా సంస్థలు.. వెన్నుదన్నుతో మీరు హాయిగా తప్పించుకోగలుగుతారు.
* మీడియా సంస్థలు ఎందుకిలా వ్యవహరిస్తున్నాయో అర్థం కావటం లేదు. సామాన్యుడి పట్ల ఉదాసీనతా? లేక మీరు వారిని ప్రభావితం చేయటం వ్లనా? మిమ్మల్ని హీరోగా, బాధితుడిగా ఎలా చెప్పగలుగుతున్నాయి?
* అదే సమయంలో మన సైనికులు, ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు వీటి గురించి ఎందుకు పట్టించుకోవు..
* కార్పొరేట్ ప్రపంచంలో మాదిరిగా సామాన్యుడిని పోలీసులు వినియోగదారుడిగా భావించేలా సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు మీడియా సంస్థలు ప్రయత్నించిన నాడు మేం సంతోషిస్తాం.
* మీలో ఇప్పటికీ పశ్చాత్తాపం లేదు. దేశ ప్రతిష్టకు ముఖ్యంగా విమానయాన రంగానికి  ఎంతో అప్రతిష్ట తీసుకొచ్చారు... దీని వల్ల కొత్తగా రావాలనుకునే కంపెనీలు విమానాల్ని అద్దెకు తీసుకోవడమే చాలా కష్టంగా మారింది.
* ప్రతి ఒక్కరికీ తెలుసు మీరు సంపాదించిన ఈ సొమ్మును మీ కొడుకు కూడా మొత్తం ఖర్చుచేయలేడని.. అలాంటప్పుడు కనీసం మా జీతాలైనా మాకు ఇవ్వవచ్చుకదా?
* మిమ్మల్ని ఇంకా గొప్పవాడిగా భావిస్తున్న ప్రజల కోసమైనా, పీహెచ్‌డీలు, అవార్డులిచ్చి సత్కరిస్తున్న అంతర్జాతీయ సంస్థల కోసమైనా  మీ బాధ్యతల నుంచి తప్పుకోండి.
* మా బకాయిలు చెల్లించడంలో ప్రధాని సాయం చేస్తారని భావిస్తున్నాం. లేదంటే మా హక్కులకు మేం దూరమవుతాం.
 మాల్యా... మీ హృదయం  మలినమైంది. మీ చేతులకు రక్తం అంటుకుంది. మీకు ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాం. వినే ఓపిక, సమయమూ మీకు లేదు. త్వరగా కోలుకోండి..
 - కింగ్‌ఫిషర్ ఉద్యోగులు, భారతదేశ పౌరులు

మరిన్ని వార్తలు