మీ బస్సులో అనుమతిస్తారా?

18 Jul, 2017 02:19 IST|Sakshi
మీ బస్సులో అనుమతిస్తారా?
జేసీ పిటిషన్‌పై  హైకోర్టు
 
సాక్షి, హైదరాబాద్‌: దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించేందుకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా విమానయాన సంస్థలను ఆదేశించాలని కోరుతూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. నిషేధంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీకి నిరాకరించింది.  జేసీపై నిషేధం విధించిన ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్, ఇండిగో, గో ఎయిర్, ఎయిర్‌ ఏసియా, స్పైస్‌ జెట్, టర్బో మెగా ఎయిర్‌ వేస్‌ తదితర విమాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది.  పౌర విమానాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌లకు కూడా నోటీసులు ఇచ్చింది.  

తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, పిటిషనర్‌ తరుఫున న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘పిటిషనర్‌ బస్సు ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిని తమ బస్సులోకి అనుమతినివ్వరు కదా. మరి విమానయాన సంస్థలు కూడా నిబంధనలనే పాటించాలి కదా. పాటించకపోతే ప్రయాణికుల భద్రత, రక్షణ ఎలా సాధ్యమవుతాయి?’అని వ్యాఖ్యానించారు. 
మరిన్ని వార్తలు