ఎయిర్టెల్ 'ఇంటర్నేషనల్' బంపర్ ఆఫర్

28 Sep, 2016 14:39 IST|Sakshi
ఎయిర్టెల్ 'ఇంటర్నేషనల్' బంపర్ ఆఫర్
దేశవ్యాప్త సేవలపైనే ఎక్కువగా దృష్టిపెట్టి సంచలనమైన ఆఫర్లు ప్రకటించిన జియోకు తలదన్నేలా  టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ భలే ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ ను వినియోగదారుల ముందుకు ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద అంతర్జాతీయంగా అన్నీ ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా భారత మొబైల్ నెంబర్ను ఏ దేశంలోనైనా వాడుకునే విధంగా వినియోగదారులకు ఎయిర్టెల్ అవకాశం కల్పించనుంది. 24x7 ఏ సమయంలోనైనా వినియోగదారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా కాల్స్ చేసుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. ఎక్కువ కాల్ చార్జీ, డేటా చార్జీలపైన ఆందోళన చెందాల్సినవసరం లేదని పేర్కొంది. ఈ ప్యాక్, పోస్ట్ పెయిడ్, ఫ్రీపెయిడ్ వినియోగదారులందరికీ వర్తించనుంది.
 
అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్ ఆఫర్ కింద ఉచిత ఇన్కమింగ్ కాల్స్, ఇండియాకు ఉచితంగా మెసేజ్లు చేసుకోవడం, అన్ని ప్రముఖ ప్రదేశాల నుంచి ఇండియాకు ఉచితంగా కాల్స్ చేసుకోవడంతో పాటు డేటా ప్రయోజనాలు కూడా అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.  ఒక్క రోజు నుంచి 30 రోజుల వరకు కాలంలో ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. అయితే ఒక్క రోజు విదేశీ ప్రయాణాలు చేయదలుచుకున్న వారు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోదలుచుకుంటే వన్-డే కింద 10 డాలర్లను(రూ.649), నెలవారీ వినియోగం కోసం 30 రోజుల ప్యాక్ కింద 75 డాలర్లు(రూ.4,999)ను కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది. 
 
 
75 డాలర్ల ప్యాక్ కింద 30 రోజుల వాలిడిటీతో 3జీబీ డేటా, అపరిమితమైన ఇన్కమింగ్ కాల్స్, ఇండియాకు కాల్స్ చేసుకోవడానికి 400 ఉచిత నిమిషాలు, ఇండియాకు అపరిమితమైన మెసేజ్లు చేసుకోవడం వంటివి కంపెనీ ఆఫర్ చేయనుంది. 10 రోజుల కాల పరిమితి కోసం 45 డాలర్లతో మీడియం వ్యవధి ప్యాక్ను వచ్చే నెల మధ్యలో లాంచ్ చేయాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.  అన్ని ప్రముఖ ప్రదేశాల్లో ఇండియాకు చేసుకునే కాల్స్ చార్జీలు తక్కువ కానున్నాయని ఎయిర్టెల్ పేర్కొంది. విదేశీ రోమింగ్ డేటా కింద ఒక్క ఎంబీని రూ.3లకే అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపు 99 శాతమని, అంతకముందు ఒక్క ఎంబీకి 650 చార్జ్ చేసేవాళ్లమని ఎయిర్ టెల్ పేర్కొంది.     
మరిన్ని వార్తలు