దుర్గాశక్తి సస్పెన్షన్‌ను సమర్థించుకున్న అఖిలేష్

1 Aug, 2013 14:24 IST|Sakshi
దుర్గాశక్తి సస్పెన్షన్‌ను సమర్థించుకున్న అఖిలేష్

మహిళా ఐఏఎస్‌ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్‌ సస్పెన్షన్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ గట్టిగా సమర్ధించుకున్నారు. ప్రార్థన మందిరం గోడను కూల్చినందుకే తాము దుర్గాశక్తి నాగ్‌పాల్‌ను విధుల నుంచి తొలగించామని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్య ముమ్మాటికి సరైనదేనని తేల్చి చెప్పారు.

ప్రజల భద్రత, సంక్షేమం విషయంలో ప్రభుత్వంతో పాటు అధికారులకు సమాన బాధ్యత ఉందని అఖిలేష్ స్పష్టం చేశారు. నాలుగురోజుల క్రితం గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లా సదర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దుర్గాశక్తి నాగ్‌పాల్‌ను అఖిలేష్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇసుక మైనింగ్ మాఫియా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రభుత్వం నాగ్‌పాల్‌ను సస్పెండ్ చేసిందంటూ విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో అఖిలేష్ వివరణ ఇచ్చుకున్నారు.

దుర్గాశక్తి నాగ్‌పాల్‌ను సస్పెండ్ చేయడంపై చేసిన ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆమెను  తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరింది. యూపీతో పాటు మధ్యప్రదేశ్లోనూ ఇసుక మైనింగ్ మాఫియా ప్రభుత్వాన్ని శాసిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు