నేను.. నాన్న.. మేనిఫెస్టో..

23 Jan, 2017 13:39 IST|Sakshi



లక్నో:
‘కామ్‌ బోల్తా హై(పనే మాట్లాడుతుంది)’ నినాదంతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌.. భారీ ఉచిత హామీలు గుప్పించారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఆదివాంర జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి అఖిలేశ్‌ తండ్రి ములాయంసింగ్‌ యాదవ్, చిన్నాన్న శివ్‌పాల్‌ యాదవ్‌ గైర్హాజరయ్యారు. దీంతో కొడుకుపై తండ్రి ఇంకా కోపంగానే ఉన్నారని, ములాయంను సంప్రదించకుండా అఖిలేశ్‌ మేనిఫెస్టో విడుదల చేశారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ చర్చకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ, నేతాజీ తనవెంటే ఉన్నారనడానికి నిదర్శనంగా సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఒక ఫొటోను పోస్ట్‌చేశారు. (ఎస్పీకి గట్టి షాక్‌!)

ములాయం రెండు చేతుల్లో రెండు మేనిఫెస్టో కాపీలు పట్టుకుని ఉండగా, పక్కనే అఖిలేశ్‌, డింపుల్‌ యాదవ్‌లు‌, మరోవైపు మంత్రి ఆజం ఖాన్‌ నిల్చున్న ఫొటోను అఖిలేశ్ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. తద్వారా తనకు తండ్రి ఆశీర్వాదాలున్నాయని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఫొటోకు మాత్రమే పోజిచ్చిన ములాయం.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్న అఖిలేశ్‌ అభ్యర్థనను మాత్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. (ప్రెషర్‌ కుక్కర్లు.. స్మార్ట్‌ఫోన్లు!)

ములాయం ప్రచారంలో పాల్గొనకపోవడం వల్ల ఎస్పీకి నష్టం వాటిల్లుతుందనే వాదన బలంగా వినిపించినప్పటికీ పెద్దాయన ససేమిరా అనడంతో.. అఖిలేశ్‌ ఈ తరహా ఫొటోలతో నష్టనివారణ చర్యలకు నడుంకట్టారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగానూ యూపీలో ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 11 మొదటిదశ, మార్చి 4న ఆఖరిదశ పోలింగ్‌ ఉంటుంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 105 సీట్లు కేటాయించిన ఎస్పీ 298 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.

మరిన్ని వార్తలు