ప్రేమను ఏ సీఎం నిషేధించాడు?

24 Aug, 2014 17:48 IST|Sakshi
ప్రేమను ఏ సీఎం నిషేధించాడు?

 మధుర:‘లవ్ జీహాద్’ను సమాజ్ వాదీ పార్టీ ప్రోత్సహిస్తుందన్నబీజేపీ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. లక్నోలోని మీడియా సమావేశంలో మాట్లాడిన అఖిలేష్.. బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 'అసలు యువకులు ప్రేమలో పడకుండా ఉండటాన్ని ఏ ముఖ్యమంత్రి నిషేధించాడో నాకు చెప్పండి. ప్రేమను మీరు నిషేధించాలనుకుంటున్నారా?' అని అఖిలేష్ ప్రశ్నించారు. అసలు ప్రేమ వ్యవహారాలను నిషేధించడం సాధ్యమయ్యే అంశమేనా?అని నిలదీశారు. శనివారం నాటి ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన సమక్షంలో సమాద్ వాదీ పార్టీలో చేరారు.


‘లవ్ జీహాద్’పై అప్రమత్తంగా ఉండాలని హిందూ యువతకు బీజేపీ సూచించింది. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని ఆరోపించింది. ‘మెజారిటీ వర్గానికి చెందిన యువతుల మతాలను మార్చేందుకు మైనారిటీ యువకులు లైసెన్స్ పొందారా?’ అని బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయి ప్రశ్నించారు. మైనారిటీ యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వమే లవ్‌జీహాద్‌ను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో లక్ష్మీకాంత్ బాజ్‌పేయి శనివారం ఈ వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ విధానాల వల్లనే  రాష్ట్రంలో మతకలహాలు చెలరేగుతున్నాయని ఆరోపించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు