టాయ్‌లెట్‌లో హీరో-హీరోయిన్ సెల్ఫీ!

6 Nov, 2016 15:12 IST|Sakshi
టాయ్‌లెట్‌లో హీరో-హీరోయిన్ సెల్ఫీ!
మురికి మరుగుదొడ్డి చూస్తే.. ఎవరైనా ఆ కంపునకు ముక్కు మూసుకుంటారు. కానీ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ మాత్రం ఏకంగా హీరోయిన్‌ను వెంటపెట్టుకొని మరుగుదొడ్డిలో సెల్ఫీ దిగాడు. ఎందుకంటే.. ఆయన మరో క్రేజీ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానసపుత్రిక అయిన ‘స్వచ్ఛ భారత్‌’  పథకం ఆధారంగా తెరకెక్కుతున్న ‘టాయ్‌లెట్‌- ఎక్‌ ప్రేమ్‌కథ’ సినిమాలో అక్షయ్‌ నటిస్తున్నాడు. సినిమా పేరులోనే టాయ్‌లెట్‌ ఉంది కాబట్టి.. తొలిరోజు మధురలో షూటింగ్‌ ప్రారంభమైన సందర్భంగా ఇదిగో ఇలా భూమి పడ్నేకర్‌తో కలిసి మరుగుదొడ్డిలో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పెట్టాడు. శ్రీ నారాయణ్‌సింగ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ స్వచ్ఛత అంశం చుట్టే తిరుగుతుందని సమాచారం. ఇటీవల మరుగుదొడ్డి లేని కారణంగా దేశంలో పలుచోట్ల పెళ్లికూతుళ్లు పెళ్లిని నిరాకరించడం, భర్తను వదిలిపెట్టడం వంటి అంశాలను ఈ సినిమాలో స్పృశించబోతున్నారని సమాచారం. 
 
ఇప్పటికే అక్షయ్‌కుమార్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అతని మూడు సినిమాలు సూపర్‌హిట్‌ అయి వందకోట్ల క్లబ్బులో స్థానం సాధించాయి. అంతేకాకుండా ‘జాలీ ఎల్‌ఎల్‌బీ-2’, రజనీకాంత్‌ ‘రోబో-2’, నీరజ్‌ పాండే ‘క్రాక్‌’  వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో అక్కీ నటిస్తున్నాడు. వరుస విజయాలు వస్తున్నా.. రోటిన్‌కు భిన్నంగా సామాజిక కథాంశంతో అక్కీ ఈసారి ‘టాయ్‌లెట్‌ ఎక్‌ ప్రేమ్‌కథ’లో నటిస్తున్నాడు. 
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా