ఫోన్ల నుంచి విమానాల వరకూ అన్నీ పరుగులే!

12 Jul, 2015 11:25 IST|Sakshi
ఫోన్ల నుంచి విమానాల వరకూ అన్నీ పరుగులే!

ఈ చిప్ కొంచెం.. వేగం మాత్రం ఘనం. స్మార్ట్‌ఫోన్ల నుంచి విమానాల వరకూ ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను, వాహనాలను ఇది పరుగులెత్తిస్తుందట. ప్రస్తుతం కంప్యూటర్లలో 14 నుంచి 22 నానోమీటర్ల మధ్య సైజులో గల చిప్‌లను వాడుతున్నారు. అయితే, ఇవి కొంచెం పెద్దగానే ఉన్నప్పటికీ.. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వేగం తక్కువ, విద్యుత్ వినియోగం ఎక్కువ అన్న రీతిలో పని జరుగుతోంది. అందుకే, సిలికాన్-జెర్మేనియంతో ఐబీఎం కంపెనీవారు దీనిని తయారు చేశారు. దీని సైజు 7 నానోమీటర్లేనట. సైజు తగ్గినా దీనిపై 20 బిలియన్‌ల ట్రాన్సిస్టర్(స్విచ్)లను అమర్చవచ్చట.

ఈ చిప్‌తో విద్యుత్ వినియోగం కనీసం 50 శాతం తగ్గి, వేగం కనీసం 50 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డాటా వ్యవస్థల సామర్థ్యం పెంచేందుకూ ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు. బుల్లి చిప్‌తో భలే ప్రయోజనాలే ఉన్నాయన్నమాట. 3 బిలియన్ డాలర్ల నిధులతో చేపట్టిన పరిశోధక ప్రాజెక్టులో భాగంగా శాంసంగ్, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన గ్లోబల్ ఫౌండరీస్‌తో కలిసి ఐబీఎం ఈ బుల్లి చిప్‌ను రూపొందించడం విశేషం.

మరిన్ని వార్తలు