'ఆ ఒక్కటీ తప్ప మిగతా పరిశ్రమలు కుదేల్'

25 Jan, 2016 16:28 IST|Sakshi
'ఆ ఒక్కటీ తప్ప మిగతా పరిశ్రమలు కుదేల్'

భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణం చేసిన తర్వాతిరోజే తదుపరి కార్యక్షేత్రం పశ్చిమబెంగాల్ పై దృష్టి సారించారు అమిత్ షా. సోమవారం కోల్ కతాలో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. దేశ ద్రోహులు, అసాంఘిక శక్తులకు పశ్చిమబెంగాల్ అడ్డాగా మారిందని, మమత నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని ఆరోపించారు.

 

'ఒక్క చిట్ ఫండ్ వ్యాపారం తప్ప రాష్ట్రంలోని మిగతా పరిశ్రమలన్నీ కుదేలయ్యాయి. చిట్ ఫండ్ వ్యాపారం మాత్రమే మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది' అంటూ శారద చిట్ ఫండ్ కుంభకోణాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ దీదీపై విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది నవంబర్ లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ఆ రాష్ట్రంలో పాగావేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్నికల ఏడాది మొదటినెలలోనే అమిత్ షా రాకతో అనధికారికంగా ప్రచార శంఖారావాన్ని పూరించినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు