మన వాయుసేన సత్తా ఎంతో తెలుసా?

14 Oct, 2016 17:14 IST|Sakshi
మన వాయుసేన సత్తా ఎంతో తెలుసా?

రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేరుతో భారతీయ వాయుదళం 1933లో కరాచీలో ప్రారంభమైంది. నేడు సరికొత్త ఫైటర్లతో వాయుదళ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న భారతీయ వాయుదళం ఇప్పటివరకూ వినియోగించిన ఫైటర్ల గురించి ఓ సారి చూద్దాం.

తొలినాళ్లలో
వెస్ట్ లాండ్ వాపిటి: నాలుగు వెస్ట్ లాండ్ వాపిటి-ఐఐఏ విమానాలతో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఐఏఎఫ్‌) 1933లో కరాచీలో ప్రారంభమైంది. దాదాపు 12 ఏళ్ల పాటు ఈ విమానాలు ఆర్ఐఏఎఫ్‌కు సేవలు అందించాయి. ఆర్ఐఏఎఫ్‌ రెండో ప్రపంచ యుద్దంలో ఈ విమానాలను వినియోగించింది. కాగా, జపాన్ వాయుసేనలు బర్మా వద్ద ఈ విమానాల్లో కొన్నింటిని ధ్వంసం చేశాయి.

టైగర్ మోత్: 1939-1957 సంవత్సరాల మధ్య టైగర్ మోత్ జెట్ లు భారతీయ వాయుదళం(ఐఏఎఫ్‌)(ఆర్ఐఏఎఫ్ ను 1950లో ఐఏఎఫ్ గా మార్చారు) లో సేవలు అందిచాయి. వీటిని బ్రిటిష్ విమాన తయారీ కంపెనీ డీ హవిల్ లాండ్ తయారుచేసింది. దీనిని 2012లో పునరుద్దరించారు. భారత వాయుదళంలోని వింటేజ్ ఫ్లీట్ లో టైగర్ మోత్ సేవలు అందిస్తోంది. కొత్త పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి కూడా దీన్ని ఉపయోగించారు.

బ్లెన్ హీమ్: 1941-42ల మధ్య బ్లెన్ హీమ్ ఆర్ఐఏఎఫ్ కు సేవలు అందించింది. లైట్ వెయిట్ బాంబులను మోసుకెళ్లగల బ్లెన్ హీమ్ లను రంగూన్ హార్బర్ లోని ఓడలకు కాపలాగా ఉపయోగించేవారు.

లైశాండర్: 1940ల్లో లైశాండర్ ఆర్ఐఏఎఫ్ కు సేవలు అందించింది. బ్రిటన్ కు చెందిన ఓ ప్రముఖ విమాన తయారీదారు దీన్ని తయారుచేశారు. 1940 మే-జూన్‌ల మధ్య యూకేఆర్ఏఎఫ్‌ 118 లైశాండర్ విమానాలను కోల్పోయింది. దీంతో వీటిని చరిత్రలో రక్షించుకోవాల్సిన విమానాలుగా అప్పటి యూకే ప్రకటించింది.

హరికేన్‌: హరికేన్ విమానాలను 1942లో ఆర్‌ఐఏఎఫ్ కు అందాయి. అప్పటి ఫైటర్లలో హరికేన్లే అత్యంత వేగవంతమైనవి. దాదాపు 300 మైళ్లకు పైగా వేగంతో హరికేన్లు దూసుకెళ్లేవీ. బర్మాలో అరకన్ యుద్దంలో హరికేన్ విమానాలు పాల్గొన్నాయి.

స్పిట్‌ ఫైర్‌: 1946లో అత్యంత విజయవంతమైన జెట్ గా స్పిట్‌ ఫైర్ పేరుగాంచింది. హరికేన్ విమానాల స్ధానంలో స్పిట్ ఫైర్ జెట్లను చేర్చారు. 1950వ దశకం వరకూ స్పిట్‌ ఫైర్ జెట్లు వినియోగంలో ఉన్నాయి.
డ్రాగన్ రాపిడ్, ఆడియో, డ్రాగన్ ప్లై, హార్వాడ్, హడ్సన్‌, వెన్ జియన్స్, డిఫియంట్, అట్లాంటా తదితర జెట్ లను ఆర్ఐఏఎఫ్ వినియోగించింది.

స్వాతంత్ర్యం తర్వాత

టెంపెస్ట్ 2: స్వతంత్ర దేశంగా భారత్ అవతరించిన తర్వాత దశాబ్ద కాలం పాటు ఐఏఎఫ్ టెంపెస్ట్-2 జెట్ లను వినియోగించింది.

డకొటా: స్వతంత్రం వచ్చే కొద్ది నెలల ముందు ఆర్ఐఏఎఫ్ ట్రాన్స్ పోర్ట్‌ దళాన్ని సీ-47 డకోటాలతో ప్రారంభించింది.

బీ-24 లిబరేటర్: 1948లో ఆర్ఐఏఎఫ్ మొదటి హెవీ బాంబర్ దళాన్ని అమెరికన్ లిబరేటర్లతో ప్రారంభించింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ వీటి వినియోగాన్ని నిలిపివేసిన తర్వాత హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్‌) వీటిని పునరుద్దరించింది. 1968 వరకూ ఇవి భారతీయ వాయుదళానికి సేవలు అందించాయి.

వాంపైర్స్: 1948లో బ్రిటిష్ వాంపైర్స్ ను ఎయిర్ ఫోర్స్ కొనుగోలు చేసింది. 1960వ దశకం ముందువరకూ 400పైగా వాంపైర్లను భారత్ వినియోగించింది.

భారత వాయుదళంలోకి ఫ్రెంచ్‌ జెట్లు
డస్సాల్ట్ ఔర్గాన్: ఫ్రెంచ్ వారి నుంచి భారత వాయుదళంలోకి ప్రవేశించిన తొలి జెట్ డస్సాల్డ్ ఔర్గాన్. 1953లో ఐఏఎఫ్ లో చేరిన ఔర్గాన్ జెట్లు 1968 వరకూ సేవలు అందించాయి.

మిస్టరీ ఐవా: 1957లో భారత వాయుదళంలో చేరిన రెండో ఫ్రెంచ్ జెట్ మిస్టరీ ఐవా. 1957లో ఐఏఎఫ్ బాగా విస్తరించింది. బ్రిటిషర్లకు చెందిన హాకర్ హంటర్లు, అమెరికన్లకు చెందిన ఎలక్ట్రిక్‌ కాన్ బెర్రా బాంబర్లు 1957లోనే ఐఏఎఫ్ లో చేరాయి.

కాన్ బెర్రాలు: 1961-62 మధ్య కాలంలో కాన్ బెర్రాలు కాంగో యుద్ధంలో పాల్గొన్నాయి. 1999 కార్గిల్ సమస్య సమయంలో నియంత్రణ రేఖ పరిధిలోని ప్రాంతాలను ఫోటోలు తీసేందుకు కాన్ బెర్రా విమానాన్ని వినియోగించారు. ఫోటోలు తీస్తున్న సమయంలో కాన్ బెర్రాపై మిస్సైల్ దాడి జరిగింది. కానీ విమానాన్ని సురక్షితంగా కిందకు దించడంలో పైలట్ విజయం సాధించారు. డెవాన్, సీ-119 పాకెట్, డీహెచ్సీ-3 ఒట్టర్, విక్కర్స్ విస్కోంట్, సికోర్ స్కై ఎస్-55 చాపర్లు తదితరాలను 1950ల్లో ఐఏఎఫ్ లో చేరాయి.

భారత వాయుదళం-సోవియట్ యూనియన్

సోవియట్ యూనియన్ కు సంబంధించిన యుద్ధవిమానాలు భారత వాయుదళంలో కీలకపాత్ర పోషించాయి. ఆ కాలంలో సోవియట్ యూనియన్ తో దౌత్యపరంగా భారత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ బంధమే ప్రస్తుత రష్యా-భారత్ ల రక్షణ ఒప్పందాలకు కారణం.

మిగ్-21(మిగిలిన రకాలు): 1963లో మిగ్-21 యుద్ధవిమానాలు భారత వాయుసేనలో చేరాయి. వీటి చేరికతో భారత రక్షణ మార్కెట్లో సోవియట్ యూనియన్ ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ యుద్ధవిమానానికి చెందిన కొన్ని వేరియంట్లను ఇప్పటికీ ఐఏఎఫ్ వినియోగిస్తోంది. 1980 నుంచి మిగ్-23, మిగ్-25, మిగ్-27, మిగ్-29 లాంటి పలురకాలను ఐఏఎఫ్ కొనుగోలు చేసింది.

ఆంటోనోవ్-12: 1961లో రష్యాకు చెందిన ఈ రవాణా విమానాన్ని ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. వీటిని 1962 చైనా-భారత్ యుద్ధంలో ఉపయోగించారు. కెనడా డీహెచ్సీ-4 కార్గో యుద్ధవిమానాలను యుద్ధం తర్వాత భారత్ కు ఇచ్చింది.

ఎమ్ఐ-4: సోవియట్ యూనియన్ కు చెందిన ఈ హెలికాప్టర్లను 1960ల్లో ఐఏఎఫ్ లో ప్రవేశపెట్టారు. దీని వేరియంట్లు ఎమ్ఐ-8లను 1970ల్లో, ఎమ్ఐ-17లను 1985లో, ఎమ్ఐ-17 వీ5లను 2012లో ఐఏఎఫ్ కొనుగోలు చేసింది.

సుఖోయ్-7: 1968లో ఐఏఎఫ్ లో ప్రవేశించిన సుఖోయ్ లను 1971 ఇండో-పాక్ యుద్ధంలో వినియోగించారు. దీని వేరియంట్ సుఖోయ్-30ని 1997లో ఐఏఎఫ్ అందుకుంది. ఫైటర్ దళాన్ని సిద్ధం చేసేందుకు భారత్ 272 సుఖోయ్ జెట్ లను ఆర్డర్ ఇచ్చింది.

ఆంటోనోవ్-32: 1983లో ఐఏఎఫ్ లో ప్రవేశించిన ఆంటోనోవ్-32లు ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి. 100కు పైగా ఆంటోనోవ్-32లు భారత వాయుసేనలో ఉన్నాయి.

అమెరికా తిరిగి రంగ ప్రవేశం
ఏహెచ్-64ఈ అపాచె ఎటాక్ హెలికాప్టర్లు: 2019లో యూఎస్ నుంచి భారత్ 22 అపాచె ఎటాక్ హెలికాప్టర్లను అందుకోనుంది. దీంతో హెలికాప్టర్ల ఫ్లీట్ ను భారత్ మరింతగా బలపర్చుకున్నట్లు అవుతుంది. ప్రస్తుతం 1980లో దళంలోకి వచ్చిన ఎమ్ఐ-25, ఎమ్ఐ-35 హెలికాప్టర్లను భారత్ వినియోగిస్తోంది.

సీహెచ్-47ఎఫ్‌ చినుక్స్: భారీ బరువులను అత్యంత ఎత్తుకు మోసుకెళ్లగల సామర్ధ్యం కలిగిన చినూక్స్ ను 2019లో యూఎస్ నుంచి భారత్ కు అందనున్నాయి. ఈ కేటగిరిలో సోవియట్ యూనియన్ అందించిన నాలుగు ఎమ్ఐ-26లలో కేవలం ఒక్కటి మాత్రమే ఇప్పుడు సర్వీసులో ఉంది.

సీ-17 గ్లోబ్ మాస్టర్3: 2014లో 10 గ్లోబ్ మాస్టర్ విమానాలను ఐఏఎఫ్ దళంలో చేర్చుకుంది. వీటిని అమెరికా వాయుదళం ఇరాక్, ఆప్ఘనిస్తాన్లలో వినియోగిస్తోంది. యుద్ధ ట్యాంకులను మోసుకెళ్లడం, హెలికాప్టర్లపై దాడి చేయడం తదితరాలకు దీన్ని వినియోగించవచ్చు.

సీ-130జే సూపర్ హెర్ క్యూల్స్: ఆరు సీ-130జే సూపర్ హెర్ క్యూల్స్ విమానాల కొనుగోలుకు 2008లో అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటన్నింటిని ఇప్పటికే వాయుదళంలో కూడా చేర్చుకుంది. మరో ఆరు సీ-130జే సూపర్ హెర్ క్యూల్స్ ను కొనుగోలు చేయడానికి డీల్ ను కూడా ఐఏఎఫ్ కుదుర్చుకుంది. ప్రత్యేక ఆపరేషన్లు, మెరుపుదాడులకు వీటిని వినియోగిస్తారు.

సొంత తయారీ

గ్నాట్: బ్రిటిష్ కు చెందిన గ్నాట్ ను 1958లో వాయుసేనలోకి తీసుకున్నార. దీనికి హెచ్ఏఎల్ లైసెన్స్ ను విడుదల చేసింది. గ్నాట్ ఇంధన సామర్ధ్యాన్ని పెంచి అజీత్ గా నామకరణం చేశారు.

హెచ్ఎఫ్‌-24 మారుత్: 1960వ దశకంలో దీన్ని ఐఏఎఫ్ లోకి ప్రవేశపెట్టారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఫైటర్ మారుత్.

తేజస్: తేజస్ యుద్ధవిమానాల దళాన్ని 2016 జులైలో రెండు తేజస్ విమానాలతో ఐఏఎఫ్ ప్రారంభించింది. భవిష్యత్తులో 120 తేజస్ జెట్లను ఫ్లీట్ లో ప్రవేశపెట్టాలని ఐఏఎఫ్ యోచిస్తోంది.

మరిన్ని వార్తలు