ఏవీఎస్ ఇకలేరు

9 Nov, 2013 02:00 IST|Sakshi

తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన హాస్యనటుడు
కాలేయం, మూత్రపిండాలకు తీవ్ర ఇన్‌ఫెక్షన్

 
 సాక్షి, హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్యనటుడు ఏవీఎస్ శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. వయసు 56 సంవత్సరాలు. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. హైదరాబాద్‌లోని మణికొండలో నివసిస్తున్న ఏవీఎస్‌కు భార్య ఆశ, కుమారుడు ప్రదీప్, కూతురు ప్రశాంతి ఉన్నారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏవీఎస్‌ను పది రోజుల కిందట చికిత్స కోసం గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. కాలేయంలో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో పాటు మూత్రపిండాలు పాడైపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పది రోజుల నుంచి ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోవటంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హైదరాబాద్ మణికొండ పంచాయతీ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో గల దేవులపల్లి అపార్ట్‌మెంట్‌లో ఆయన స్వగృహానికి తరలించారు. ఏవీఎస్ రాత్రి 8.05 నిమిషాల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయనకు 2008లో కాలేయం పాడైపోగా.. అప్పట్లో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఏవీఎస్ కుమార్తె శ్రీప్రశాంతి ఆయనకు లివర్‌ను దానం చేశారు.
 
  శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న ఆయన మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఐదేళ ్లపాటు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే నటనే ప్రాణంగా బతుకుతున్న ఏవీఎస్ వేళకు మందులు వేసుకోకపోవడం, సమయానికి వైద్యుడిని సంప్రదించకపోవడం వంటి కారణాలతో కాలేయంలో ఇటీవల మళ్లీ ఇన్‌ఫెక్షన్ వ చ్చింది. మళ్లీ ఆస్పత్రిలో చికిత్స అందించినప్పటికీ.. ఇన్‌ఫెక్షన్ తగ్గకపోగా మూత్రపిండాలపై కూడా ప్రభావం పడింది. మూత్రపిండాలు కూడా పాడైపోవడంతో డయాలసిస్ చేస్తున్నారు. ఏవీఎస్‌కు మళ్లీ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసినా ఫలితం ఉండదని, కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారని, ఇక తాము ఏమీ చేయలేమని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు ఆయన్ను శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాక తనను చూసేందుకు వచ్చిన వారితో ఏవీఎస్ మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆయన కన్నుమూశారు.
 
 ప్రముఖుల నివాళులు: పాత్రికేయుడు, హాస్యనటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడిగా బహుముఖ ప్రతిభాశాలి అయిన ఏవీఎస్ మరణంతో మణికొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనను చివరిసారిగా పరామర్శించిన వారిలో సినీ ప్రముఖులు మురళీమోహన్‌తో పాటు శివకృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ, జయలలిత, అశోక్‌కుమార్, మహర్షి ఉన్నారు. ఏవీఎస్ మరణం విషయం తెలుసుకుని సినీనటులు సాయికుమార్, ఆలి, ఉత్తేజ్ లు నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
 
 ఏవీఎస్ మృతికి కిరణ్, బాబు, చిరంజీవి విచారం

 ఏవీఎస్ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఏవీఎస్ ఉత్తమ నటుడని, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని సీఎం పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏవీఎస్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవీఎస్ మృతి సినీ ప్రపంచానికి తీరనిలోటని కేంద్ర మంత్రి చిరంజీవి సంతాపం వ్యక్తంచేశారు. రాష్ట్ర మంత్రి డీకే అరుణ ఏవీఎస్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. జర్నలిస్టుల ఉద్యమంలో ఏవీఎస్ ఎనలేని కృషి చేశారని స్మరించుకున్నారు. పాత్రికేయుల హక్కుల కోసం ఆయన పోరాటం చేశారని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు సోమసుందర్, ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిడి సోమయ్యలు సంతాపం తెలిపారు.
 
 కళా రంగానికి తీరని లోటు: జగన్ సంతాపం

 హాస్యనటుడు ఏవీఎస్ మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఏవీఎస్ మరణం కళా, సాంస్కృతిక రంగాలకు తీరనిలోటన్నారు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఏవీఎస్ సినీరంగంలో స్థిరపడి, తన నటనతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నారని కీర్తించారు. ఏవీఎస్ మృతి సినిమా రంగానికి తీరని లోటంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు