కెప్టెన్‌కు టాటా.. సిద్దూకు సీఎం పీఠం!

24 Jan, 2017 12:06 IST|Sakshi
కెప్టెన్‌కు టాటా.. సిద్దూకు సీఎం పీఠం!

అమృత్‌సర్‌: ఎన్నికల రాష్ట్రం పంజాబ్‌లో ఇప్పుడో కొత్త ప్రచారం మొదలైంది. ‘నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూను ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయండి..’ అని సందేశమిస్తున్న రాష్ట్రమంతటా పోస్టర్లు వెలుస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్‌ అమరీందర్ సింగ్ వయసు ప్రస్తుతం ‌75 ఏళ్లు. ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్యం సాకుతో అమరీందర్‌ను పక్కన పెడతారని, సిద్దూను సీఎం చేస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటికితోడు కెప్లెన్‌ కూడా ‘నేను పోటీ చేసే చివరి ఎన్నకలు ఇవే’నని స్పష్టం చేశారు. వీటన్నింటిపై కెప్టెన్‌ అమరీందర్‌ మీడియాకు వివరణ ఇచ్చారు.

‘సిద్దూ సీఎం అవుతారంటూ వెలసిన పోస్టర్లకు, కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధంలేదు. బీజేపీ, ఆమ్‌ఆద్మీపార్టీలే వాటిని అంటిచాయి. తద్వారా కాంగ్రెస్‌లో ఏదో జరుగుతోందన్న ప్రచారం చేయాలన్నది ఆ పార్టీల పన్నాగం. ఇక సిద్దూ పిల్లాడిగా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. వాళ్ల నాన్న మా అమ్మ దగ్గర సెక్రటరీగా పనిచేశారు. క్రికెట్‌లో ఎంతో పేరు తెచ్చుకున్న అతను.. బేషరతుగా కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు’ అని కెప్టెన్‌ వివరించారు.

అయితే గెలిచినా, ఓడినా తాను పోటీ చేసే చివరి ఎన్నకలు మాత్రం ఇవేనని స్పష్టం చేశారు అమరీందర్‌ సింగ్‌. ‘ఇప్పుడు నాకు 75 ఏళ్లు. వచ్చే ఎన్నికల నాటికి 80ఏళ్లు నిండుతాయి. అసలే మనది యువతరం నిండినదేశం కాబట్టి నేను తప్పుకోక తప్పదు’ అని కెప్టెన్‌ చెప్పారు. కాంగ్రెస్‌- అకాళీదల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను అమరీందర్‌ ఖండించారు. గెలుపుపై ధీమా ఉంది కాబట్టే నేరుగా సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ను (లాంబి నియోజకవర్గంలో) ఢీకొంటున్నానని గుర్తుచేశారు.
('తమిళనాడుకు మనకు ఇంత తేడానా?')


 

మరిన్ని వార్తలు