మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే: రాహుల్

27 Jan, 2017 14:32 IST|Sakshi
మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే: రాహుల్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార పర్వం పూర్తిస్థాయిలో వేడెక్కింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పంజాబ్‌లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఇన్నాళ్లుగా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయమై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఆయన తెరదించారు. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని కుండ బద్దలు కొట్టారు. రైతులు బాదల్ (మేఘాలు) చూస్తే సంతోషపడతారని, కానీ పంజాబ్‌లో మాత్రం బాదల్ (సీఎం) నీళ్లు ఇవ్వడం లేదని చమత్కరించారు. 'అంతా నీదే' అని గురునానక్ అంటారు గానీ, అకాలీదళ్ మాత్రం 'అంతా నాదే' అంటుందని ఎద్దేవా చేశారు. 
 
నాలుగేళ్ల క్రితం తాను వచ్చినప్పుడు పంజాబ్ యువతలో 70 శాతం మంది డ్రగ్స్ బారిన పడ్డారని చెప్పానని, అప్పట్లో బాదల్ కుటుంబ సభ్యులు తనను వెక్కిరించారని, కానీ ఇప్పుడు మొత్తం పంజాబ్ అంతా తాను చెప్పిందే చెబుతోందని రాహుల్ అన్నారు. ప్రతి పరిశ్రమలోను, వ్యాపారంలోను ఒక్క కుటుంబ ఏకస్వామ్యం నడుస్తోందని మండిపడ్డారు. పంజాబ్‌లో ఎక్కడకు వెళ్లాలన్నా బాదల్ బస్సులలోనే వెళ్లాల్సి ఉంటుందని విమర్శించారు. తానిక్కడ కేవలం రెండు మూడు విషయాలు మాత్రమే చెబుతానని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తాము ఒక చట్టం చేస్తామని.. ఆ తర్వాత కనీసం డ్రగ్స్ అన్న ఆలోచన వచ్చినా వణుకు పుడుతుందని చెప్పారు. పంజాబ్‌ను ఎవరు గాయపరిచారో వాళ్లను తాము జైల్లో వేసి చూపిస్తామని, పంజాబ్ కోసమే తమ పోరాటం ఉంటుందని రాహుల్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెబుతారని, అలాంటప్పుడు ఆయన అకాలీదళ్‌ను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. పంజాబ్‌ను అకాలీదళ్ సర్వనాశనం చేసిందని చెప్పారు. 
మరిన్ని వార్తలు