చంద్రబాబుకు అహంకారం పెరిగింది

1 Sep, 2017 18:03 IST|Sakshi
చంద్రబాబుకు అహంకారం పెరిగింది

- శాశ్వతంగా అధికారంలో ఉంటానని భ్రమపడుతున్నారు
- కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చిత్తుగా ఓడిపోయింది మర్చారా?
- పోల్‌,పొలిటిక్‌ మేనేజ్‌మెంట్‌ వల్లే నంద్యాల, కాకినాడలో గెలుపు
- పాలన బాగుంటే నంద్యాలకు అన్ని నిధులెందుకు ఇచ్చారు?
- వైఎస్సార్‌సీపీది ఎన్నటికీ ప్రజల పక్షమే: మీడియాతో అంబటి రాంబాబు


గుంటూరు:
పోల్‌ మేనేజ్‌మెంట్‌, పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ చేసి అడ్డదారిలో గెలిచిన చంద్రబాబు నాయుడుకు అహంకారం పెరిగిందని, శాశ్వతంగా అధికారంలోతానే ఉంటానన్న భ్రమలో మునిగిపోయారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు విమర్శించారు. నియంతలైన హిట్లర్‌, సద్దాం హుస్సేన్‌ల మాదిరే ఇప్పుడు చంద్రబాబు ఆలోచిస్తున్నారని, ప్రతిపక్షం ఉండకూడదనే భ్రమలోకి వెళ్లారని మండిపడ్డారు. ఏది ఏమైనా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మొక్కవోని దీక్షతో పనిచేస్తుందని, ప్రజా ఉద్యమాలతో చంద్రబాబును పడగొడుతుందని అన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘మొన్న నంద్యాలలో, నేడు కాకినాడలో చంద్రబాబు, ఆయన పార్టీ.. పోల్‌, పొటిటిక్‌ మేనేజ్‌మెంట్‌కు పాల్పడినందునే గెలిచిందికానీ, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో కాదు. అడ్డదారి విజయానికి కూడా పొంగిపోతోన్న చంద్రబాబు.. ప్రతిపక్షం పని అయిపోయిందని అంటున్నారు. అయ్యా బాబు గారూ.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నువ్వు తుక్కుతుక్కుగా ఓడిపోలేదా? 2012 ఉప ఎన్నికల్లో టీడీపీకి కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదని మర్చిపోయావా? చంద్రబాబుకు తన మూడేళ్ల పాలనపై నమ్మకం ఉంటే, ఎన్నికలకు ముందే నంద్యాలకు అన్ని కోట్ల నిధులు ఎందుకు ఇచ్చారు? ఆ సమయంలోనే మైనారిటీలకు పదవులు ఎలా కట్టబెట్టారు? ఇవన్నీ ప్రజలకు తెలియదనుకుంటున్నారా? డబ్బు, అధికార దుర్వినియోగంతో గెలిచి విర్రవీగడం తగదు’’ అని అంబటి వ్యాఖ్యానించారు.

మొక్కవోని ధైర్యంతో వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది: తాత్కాలిక విజయాలకు పొంగిపోతోన్న చంద్రబాబుకు ఓటమి తప్పదని, ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ తన విద్యుక్తధర్మాన్ని నెరవేర్చుతుందని అంబటి అన్నారు.  ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరాయంగా పోరాటాలు చేస్తుందని, టీడీపీని ఓడిస్తుందని తెలిపారు. అడ్డదారులు తొక్కే తత్వం చంద్రబాబుదైతే, నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే తత్వం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిదని అంబటి గుర్తుచేశారు.