అంబేడ్కర్ రాజకీయ అస్పృశ్యత బాధితుడు: మోదీ

21 Apr, 2015 04:27 IST|Sakshi
అంబేడ్కర్ రాజకీయ అస్పృశ్యత బాధితుడు: మోదీ

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవించి ఉన్న సమయంలో సామాజిక అసృ్పశ్యతకు, మరణించిన తరువాత రాజకీయ అస్పృశ్యతకు బాధితుడయ్యారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. సామాన్యమైన కుటుంబ నేపథ్యం కలిగిన తాను భారత ప్రధానిని కాగలిగానంటే అది అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం చలవేనన్నారు. ‘అంబేడ్కరే లేకుంటే నరేంద్ర మోదీ ఎక్కడ ఉండేవాడు? అని నేను అనుకుంటూ ఉంటాను’ అన్నారు. అంబేడ్కర్‌ను కేవలం అణగారిన, వెనకబడిన వర్గాల అభ్యున్నతికే కృషి చేసాడని భావించడం సరికాదని, ఆయన సమస్త మానవాళి సంక్షేమం కోసం కృషి చేశారని కొనియాడారు.

జనపథ్‌లో ‘డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్’కు సోమవారం ప్రధాని శంకుస్థాపన చేశారు.  గత ప్రభుత్వాలన్నీ అంబేడ్కర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని, చివరకు ఆయన స్మారక కేంద్రం కూడా రాజకీయ అస్పృశ్యతను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ‘అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఫైలు 1992 నుంచి ముందుకు, వెనక్కు వెళ్తోంది. ఆ బాధ్యత నావద్దకు వచ్చినప్పుడు.. 20 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ పనిని 20 నెలల్లో పూర్తి చేయాలని నేననుకున్నాను’ అని చెప్పారు.
 

మరిన్ని వార్తలు