కొనుగోళ్లతో కుదుటపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ

29 Jul, 2016 15:57 IST|Sakshi
కొనుగోళ్లతో కుదుటపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ

వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసిన ఫలితాలతో పోలిస్తే రెండో త్రైమాసికంలో మరింత పుంజుకుంది. వినియోగదారులు ఎగబడి ఉత్పత్తి వస్తువులను కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. వినియోగదారులు సరకులతో తమ సంచులను నింపుకుంటూ అమెరికా ఆర్థిక రంగాన్ని గాడిన పెడుతున్నారని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా ఆర్థిక కార్యకాలపాల్లో మూడింట రెండు వంతులు వినియోగదారుల కొనుగోళ్ల నుంచి వచ్చేదే.
 

వినియోగదారుల కొనుగోళ్లు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వార్షికంగా వృద్ధి రేటు 1.1 శాతం ఉండగా, రెండో త్రైమాసికంలో అది 2.6 శాతానికి పెరిగింది. ఈ ట్రెండ్ కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయని, మున్ముందు ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకోవచ్చని ‘మూడీస్ అనలిటిక్స్’కు చెంది ఆర్థిక నిపుణులు ర్యాన్ స్వీట్ వ్యాఖ్యానించారు. దేశంలో వినియోగదారుల కొనుగోళ్లు పెరుగుతున్నప్పటికీ ఉత్పాదక వస్తువులకు జూన్ నెలలో ఆర్డర్లు ఎక్కువగా లేకపోవడం, నూతన పెట్టుబడులు పడిపోవడం ఆందోళనకర విషయం.
 

అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి వినియోగదారుల కొనుగోళ్లు పెరగడంతోపాటు ఉత్పాదక వస్తువుల (కాపిటల్ గూడ్స్)కు డిమాండ్ పెరగడం, పెట్టుబడులు పెరగడం అంతే ముఖ్యం. ఈ రెండో అంశమే ఆశాజనకంగా లేదు. దానికి రెండు కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిగ్జిట్ ద్వారా బ్రిటన్ తప్పుకోవడం ఒకటైతే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం రెండో కారణం. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లలో ఎవరు గెలుస్తారో, ఎవరు గెలిస్తే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందన్న విషయంలో పెట్టుబడిదారుల్లో సందిగ్ఢత నెలకొనడం వల్ల ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష ఎన్నికలు ప్రభావితం చేస్తున్నాయి.
 

రెండు ముఖాలున్న అమెరికా ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల కొనుగోళ్లు పెరిగి, పెట్టుబడుల రంగం బలహీనంగా కొనసాగినట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మందగమనంతోనే ముగుస్తుందని న్యూయార్క్‌లోని ‘స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్’ సీనియర్ ఆర్థిక నిపుణులు థామస్ కాస్టర్గ్ హెచ్చరిస్తున్నారు. ద్రవ్యలోటును ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచేందుకు కృషి చేస్తున్న ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కూడా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ద్రవ్యలోటును నియంత్రించడం కోసం ఈసారి కూడా వడ్డీ రేట్లను తగ్గించకపోవడం ప్లస్ పాయింటే.

మరిన్ని వార్తలు