అమెరికాను వణికిస్తున్న మంచుతుపాను

24 Jan, 2016 02:17 IST|Sakshi
అమెరికాను వణికిస్తున్న మంచుతుపాను

అమెరికాలోని నాష్‌విల్లే నగరంలో భారీగా కురుస్తున్న మంచు
9 మంది మృతి
 
 వాషింగ్టన్: అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. దేశ రాజధాని వాషింగ్టన్‌లో ఒక్క రోజే 30 అంగుళాల మంచు కురిసింది. 10 రాష్ట్రాలు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఇప్పటివరకు 9 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు.  పది లక్షల మంది  మంచులో ఇరుక్కున్నట్లు అధికారులు శనివారం ప్రకటించారు. జార్జియా, ఉత్తర కరోలినా, టెన్నెస్సీ, మేరేలాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, కెంటుకీ రాష్ట్రాలు మంచు తుపానుకు విలవిల్లాడిపోతున్నాయి.

వర్జీనియాలో తెలుగు జనాభా ఎక్కువగా ఉండటంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. ఎవరూ కూడా ఇళ్లు వదిలి బయటకు రాకూడదని తన సభ్యులకు విజ్ఞప్తి చేసింది. ఒక్క వర్జీనియాలోనే దాదాపు 800 ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వర్జీనియాలోని గురుద్వారాలు, ఆలయాల్లో మంచులో చిక్కుకుపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ తుపాను వల్ల దాదాపు లక్షా ఇరవై వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు వంద బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పరిస్థితిలో మార్పు రాదని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు