మీ బాస్మతీ మాకొద్దు!

12 Jan, 2014 00:35 IST|Sakshi
మీ బాస్మతీ మాకొద్దు!

ఎగుమతులు తిరస్కరిస్తున్న అమెరికా
కాకర, బెండ, మిర్చి ఉత్పత్తులు కూడా..
పురుగు మందుల అవశేషాలే కారణం

 
 సాక్షి, హైదరాబాద్: పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉంటున్న కారణంగా ఇటీవలి కాలంలో మన దేశానికి చెందిన వ్యవసాయోత్పత్తులు ఎగుమతికి నోచుకోక పోవడం ప్రభుత్వవర్గాలను కలవరపరుస్తోంది. అమెరికా ఆహార, పురుగుమందుల పర్యవేక్షణ శాఖ గణాంకాల మేరకు ఎక్కువ వ్యవసాయోత్పత్తులు తిరస్కరణకు గురవుతున్న దేశాల్లో మన  దేశం చైనా తర్వాత రెండోస్థానంలో ఉంది. దీనివల్ల  విదేశీ మారకద్రవ్యం తగ్గిపోవడం కాగా...ఇలా తిరస్కరణకు గురైన సరుకులు దేశీయ మార్కెట్‌లో యథేచ్ఛగా చలామణి అవుతున్నాయి. వీటివల్ల వినియోగదారుల ఆరోగ్యానికి చేటు కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పలు రకాల బియ్యం, కూరగాయలు కూడా ఈ విధంగా తిరస్కరణకు గురవుతున్నారుు. మన దేశ వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల విలువ దాదాపు 1,500 కోట్ల డాలర్లు.
 
 అయితే 2013 నవంబర్‌లో 202 సందర్భాల్లో భారత వ్యవసాయోత్పత్తులను అమెరికా తిరస్కరించింది. ఎక్కువగా బాస్మతి బియ్యం తిరస్కరణకు గురవుతుండటం గమనార్హం. 2013 అక్టోబర్, నవంబర్ నెలల్లో దాదాపు 13 కంపెనీలు ఎగుమతి చేసిన బాస్మతి, సోనామసూరి బియ్యాన్ని అమెరికా తిరస్కరించింది. పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో బాస్మతి పైరుపై అగ్గితెగులు నివారణకు ‘ట్రై సైక్లోజోల్’ మందును అధికంగా వాడుతున్నారని, ఈ కారణంగానే బియ్యం ఎగుమతులను అమెరికా తిరస్కరిస్తోందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అమెరికా నిబంధనల ప్రకారం బాస్మతిలో ‘ట్రై సైక్లోజోల్’ అవశేషాలు 0.01 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) కన్నా ఎక్కువ ఉండకూడదు. మనదేశం ఎగుమతి చేస్తున్న బియ్యంలో దీని అవశేషాలు ఈ పరిమితికి మించి ఉండటం వల్ల అవి తిరస్కరణకు గురవుతున్నాయి. అహార పదార్థాల్లో పురుగుమందుల అవశేషాలను నిర్ధారించే, నియంత్రించే విధివిధానాలే మనకు లేవు. దీంతో ఆ సరుకు యథేచ్ఛగా దేశీయ మార్కెట్లలో చలామణి అవుతుంది. దీని వల్ల దేశీయ వినియోగదారులకు కలిగే నష్టం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు.
 

మరిన్ని వార్తలు