పట్టు వీడని అమెరికా

8 Jan, 2014 02:33 IST|Sakshi
పట్టు వీడని అమెరికా

న్యూయార్క్/వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసిందంటూ ఓవైపు మొసలి కన్నీరు కారుస్తున్న అమెరికా.. మరోవైపు మాత్రం తన పట్టువీడడం లేదు. దేవయానిని పూర్తిస్థాయిలో కేసులో ఇరికించడానికి యత్నిస్తోంది. వీసా మోసం కేసులో తనపై అభియోగాలు నమోదు చేయడానికి ఈ నెల 13 వరకు ఉన్న గడువును నెల రోజులపాటు పొడిగించాలని దేవయాని కోరగా.. దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అమెరికా ప్రాసిక్యూటర్ తేల్చిచెప్పారు. అమెరికా ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా(ఈయన భారత్‌లోనే పుట్టారు) కార్యాలయం.. దేవయానిని అరెస్టు చేసిన 30 రోజు ల్లోపు.. అంటే ఈ నెల 13కల్లా ఆమెపై అభియోగాలు నమో దు చేయాల్సి ఉంది.
 
 ఈ నేపథ్యంలో దేవయాని తరఫు న్యాయవాది డేనియల్ అర్షక్.. న్యూయార్క్ దక్షిణ జిల్లాలోని జిల్లా కోర్టులో సోమవారం అభ్యర్థన దాఖలు చేశారు. ‘ప్రాసిక్యూషన్‌కు, డిఫెన్స్ పార్టీకి, ప్రభుత్వ విభాగాలకు మధ్య పలు కీలకమైన చర్చలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. అయితే గడువు దగ్గరపడిపోవడంతో.. ఈ చర్చలకు విఘాతం కలుగుతోంది’ అని ఆ అభ్యర్థనలో పేర్కొన్నారు. గడువు నెల రోజులు పెంచాలని అడిగారు. దీనిపై ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా స్పందిస్తూ.. గడువు పొడిగింపునకు అంగీకరించబోమని చెప్పారు. అభియోగాలు నమోదు చేసిన తర్వాత కూడా చర్చలు జరుపుకోవచ్చన్నారు. దేవయానికి పూర్తి దౌత్య రక్షణ కల్పించేందుకు వీలుగా భారత్ ఆమెను ఐక్యరాజ్యసమితికి బదిలీ చేసినప్పటికీ.. అమెరికా మాత్రం బదిలీని ఇంకా ఆమోదించలేదు. చట్ట ప్రకారం కొన్ని ఫైళ్లు ఇంకా సిద్ధం కావాల్సి ఉందంటూ రెండు వారాలుగా కాలం గడుపుతోంది.
 
 పరిష్కారానికి 3 అవకాశాలు..
 రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిన దేవయాని సమస్య పరిష్కారానికి మూడు అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అమెరికా పాలనా యంత్రాంగంలో చర్చ జరుగుతోంది. వాటిలో మొదటిది.. ఐక్యరాజ్యసమితికి ఆమె బదిలీని.. నేరాభియోగాలు మోపడానికి ముందే అంగీకరించడం ద్వారా పూర్తి స్థాయి దౌత్య రక్షణ ఆమెకు కల్పించడం. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుండాలని కోరుకుంటున్న వారు.. దీనికి మద్దతిస్తున్నట్లు సమాచారం. ఇక రెండోది.. ఆమెపై అభియోగాలు నమోదు చేశాక ఐక్యరాజ్యసమితికి బదిలీని అంగీకరించడం. మూడోది.. నేరాభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణం చూపి.. ఐక్యరాజ్యసమితికి ఖోబ్రగడే బదిలీని తిరస్కరించడం. అమెరికా దౌత్యవేత్తల హోదా తగ్గిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా చివరి ఆప్షన్ ప్రయోగించాలని అమెరికా పాలనా యంత్రాంగంలో మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
 
 అమెరికా కాన్సులేట్ ముందు దేవయాని తండ్రి ధర్నా
 ముంబై: దేవయాని అరెస్టు అక్రమమంటూ ఆమె తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే ముంబైలో అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నాకు దిగారు. ‘నా కుమార్తె అరెస్టు అక్రమం. ఈ విషయాన్ని స్వయానా అమెరికా కూడా అంగీకరించింది. ఆమెపై అభియోగాలన్నీ బూటకం’ అంటూ ఆయ న నినదించారు. ఆమె అరెస్టును కిడ్నాప్‌తో పోల్చారు.
 

మరిన్ని వార్తలు