‘సాఫ్ట్ పవర్’ దేశాల్లో అమెరికా ఫస్ట్

27 Aug, 2016 20:30 IST|Sakshi
‘సాఫ్ట్ పవర్’ దేశాల్లో అమెరికా ఫస్ట్

లండన్: ప్రపంచంలో సూపర్ పవర్-30 దేశాలు ఏవంటూ ఎవరైనా అడిగితే అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, చైనా....అంటూ చెప్పుకుంటూ పోవచ్చు. కానీ సాఫ్ట్ పవర్-30 కంట్రీస్ (మృదువైన దేశాలు) ఏవంటే ఎవరైనా తడుముకోవాల్సిందే. మనకు అలా తడుముకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఏడాది సాఫ్ట్ పవర్-30 దేశాల జాబితాను పోర్ట్‌లాండ్ కమ్యూనికేషన్స్ ఎంపిక చేసింది. వాటిలో ఈసారి అగ్రస్థానాన్ని అమెరికా ఆక్రమించడం అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం. యుద్ధాల ద్వారా కాకుండా మానవ హృదయాలను కొల్లగొట్టడం ద్వారా, బలవంతపు విధానాల ద్వారా కాకుండా మనసులను దోచుకొని పరిపాలనను ముందుకు తీసుకెళ్లడాన్నే ‘సాఫ్ట్ పవర్’ దేశాలని పిలుస్తారు.

మొట్టమొదట ఈ పదాన్ని అమెరికా రాజనీతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ జోసఫ్ శామ్యూల్ న్యే 26 ఏళ్ల క్రితం కాయిన్ చేశారు. వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో, డిజిటల్ ప్రభుత్వ పాలనతో, ఉన్నత విద్యా ప్రమాణాల్లో సాధించిన ఫలితాలను కూడా ఈ దేశాల ఎంపికలో ప్రమాణాలుగా స్వీకరించారు. 25 దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ పోలింగ్‌తోపాటు ఫేస్‌బుక్‌లో ప్రభుత్వం, ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. సాఫ్ట్ పవర్ దేశాల జాబితాలో గతేడాది మొదటి స్థానంలో ఉన్న బ్రిటన్ ఈ సారి రెండో స్థానానికి దిగజారగా, మూడో స్థానంలో ఉన్న అమెరికా మొదటి స్థానానికి ఎగబాకింది.

వాస్తవానికి బ్రిటన్ స్థానం పడిపోయిందని చెప్పలేం. ఎందుకంటే అక్కడ పరిగణలోకి తీసుకున్న ప్రమాణాలేవీ పడిపోలేదు. వ్యాపార వాణిజ్య, విద్యా రంగాల్లో ప్రగతి నిలకడగా  ఉండడమే కాకుండా సాంస్కృతిక రంగంలోకి వచ్చే రియో ఒలింపిక్స్‌లో కూడా బ్రిటన్ చూపిన ప్రతిభ తక్కువేమి కాదు. బీబీసీ వరల్డ్ సర్వీసు, బ్రిటిష్ కౌన్సిల్, బ్రిటష్ మ్యూజియం కాంట్రిబూషన్ కూడా తక్కువేమి కాదు. ఆక్సోఫామ్ లాంటి మానవ హక్కుల సంస్కరణలు, ‘సేవ్ ది చిల్డ్రన్’ ప్రచారోద్యమం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సేవలు తక్కువేమి కావు.  కాకపోతే బ్రిటన్‌కన్నా పరిగణలోకి తీసుకున్న ప్రమాణాల్లో  అమెరికా అధిగమించింది.

 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యుద్ధాలు చేయడం, కఠినమైన విధానాలను అనుసరించకుండా విదేశాంగ విధానాల్లోనూ మృదువైన వైఖరిని అవలంబించారు. క్యూబాను సందర్శించడం, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆంక్షలను వియత్నాంపై ఎత్తివేయడం లాంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ఇరాన్ అణు ఒప్పందం విషయంలో దౌత్యపరమైన చొరవ తీసుకోవడం అమెరికాకు విదేశాంగ విధానంలో లాభించిన అంశాలు. ప్రపంచ ఉత్తమ యూనివర్శిటీ ర్యాంకింగ్‌లలో కూడా అమెరికా యూనివర్శిటీలు ఎక్కువగా ఉండడం, సాంస్కృతిక రంగంలో రియో ఒలింపిక్స్‌లో ఎప్పటలా రాణించడమే కాకుండా హాలివుడ్ సినిమా కాంట్రిబూషన్ కూడా అమెరికా స్థానం ఎదగడానికి తోడ్పడ్డాయి.

జర్మనీ, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, కెనడా, జపాన్ తదుపరి ఐదు స్థానాలను గతంలోలాగే ఆక్రమించాయి. అయితే వాటి వరుస క్రమం మాత్రం జాబితాలో మారింది. యూరప్ దేశాలతో పోలిస్తే ఉత్తర అమెరికా, ఆసియా దేశాలు సాఫ్ట్ పవర్ దేశాల జాబితాలో తమ స్థానాలను మెరగుపర్చుకుంటుండగా, యూరప్‌లోని సగం దేశాల స్థానాలు దిగజారి పోతున్నాయి. శరణార్థుల సంక్షోభం, ఆర్థిక సమస్యలు, రాజకీయ వైరుధ్యాల కారణంగా యూరప్ దేశాల స్థానాలు పడిపోతున్నాయి. చైనా, జపాన్, సింగపూర్ దేశాలు గతంలోకన్నా తమ స్థానాలను మెరగుపర్చుకున్నాయి.

మరిన్ని వార్తలు