అమెరికా ఎన్నికలు: కీలక ఘట్టం

26 Sep, 2016 21:06 IST|Sakshi
అమెరికా ఎన్నికలు: కీలక ఘట్టం

వాషింగ్టన్ డీసీ: అమెరికన్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరింది. రేసులో ఉన్నామని ప్రకటించిది మొదలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ వచ్చిన కీలక నేతలు ఇద్దరు ఇప్పుడు ఎదురెదురుగా తలపడునున్నారు. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ లు సోమవారం రాత్రి ముఖాముఖి చర్చాకార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

ఎన్నికల ప్రక్రియలో కీలకంగానే కాక, ఓటర్లను ఆకట్టుకునేందుకు చక్కటి వేదికగా భావించే ఈ డిబేట్ లో ఎవరికి వారు తమ విధానాలను ప్రకటిస్తూ, ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ చర్చలో పాల్గొనడం ఏమంత సులువైన పనేమీకాదు. do’s and don’ts రూపంలో ఎంతో క్రమశిక్షణగా వ్యవహరించాల్సి ఉంటుంది.  ఆ నిబంధనలతోపాటు ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాల్ని ఓ సారి పరిశీలిస్తే..

డిబేట్ ఎప్పుడు మొదలవుతుంది?
అమెరికన్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి సరిగ్గా 9 గంటలకు.

ఎక్కడ జరుగుతుంది? ఎలా వీక్షించాలి?
హోఫ్స్ట్రా యూనివర్సిటీ లెక్చర్ హాల్ లో ఈ చర్చాకార్యక్రమం జరుగుతుంది. న్యూయార్క్ తూర్పున 30 మైళ్ల దూరంలో ఉంటుంది. 2008 ఎన్నికల్లో బరాక్ ఒబామాకు జాన్ మెకెయిన్కు మధ్యన అలాగే 2012 ఎన్నికల్లో భాగంగా బరాక్ ఒబామాకు మిట్ రోమ్నీకి మధ్య ఈ హాలులోనే పరస్పర చర్చకు వేదికైంది. అమెరికాలోని అన్ని చానెళ్లతోపాటు ప్రపంచంలోని ప్రముఖ చానెళ్లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. 

ప్రేక్షకులు చేయకూడనిది..
చర్యలో పాల్గొనే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం, నవ్వడం లాంటి చర్యలు చేయకూడదు.

దేని గురించి మాట్లాడతారు? ఎంత సేపు?
1. America’s Direction, 2. Achieving Prosperity, 3. Securing America అనే మూడు అంశాలపై ఆయా పార్టీలు మాట్లాడాలి. ఒక్కో అంశాన్ని 15 నిమిషాలలోపే మాట్లాడాలి. మధ్యలో విరామం లేకుండా మొత్తంగా చర్చ మొత్తం 90 నిమిషాల్లో ముగుస్తుంది.

అభ్యర్థులను ప్రేక్షకులు ప్రశ్నించవచ్చా?
అంశాలవారీగా ప్రసంగించే అభ్యర్థులను ప్రేక్షకులు ప్రశ్నించే అవకాశం లేదు. అదే సమయంలో వక్తలు కూడా ప్రేక్షకులను ఎలాంటి ప్రశ్నలూ వేయకూడదు.

అభ్యర్థులు పరస్పరం ప్రశ్నించుకోవచ్చా?
లేదు, ప్రశ్నించకూడదు.

చర్చ జరిగేప్పుడు అభ్యర్థులు కూర్పోవచ్చా?
కూర్చోవడానికి వీలులేదు.

ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేప్పుడు మధ్యమధ్యలో కమర్షియల్ బ్రేక్స్ ఇవ్వొచ్చా?
ఇవ్వడానికి వీలులేదు.

ఈ  కార్యక్రమానికయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు?
అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చర్చలను ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కమిషన్ (సీపీడీ) అనే సంస్థ నిర్వహిస్తుంది. ఎవరి పట్ల పక్షపాత వైఖరిని చూపకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా న్యాయంగా నిర్వహించడానికి 1987 లో ఈ సంస్థ ఏర్పాటైంది.

ఈ చర్చకు నిబంధనలను ఎవరు ఖరారు చేస్తారు?
ఈ చర్చకు ఒక వారం రోజుల ముందు సీపీడీ ఆయా అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. అనంతరం చర్చలో తీసుకునే అంశాలను నిర్ణయిస్తుంది. అమెరికా అధ్యక్ష రేసులో జరిగే ప్రైమరీల్లో సీపీడీ ఎక్కడా పాల్గొనదు.

నిబంధనలను మార్చవచ్చా?
ప్రధానమైన నిబంధనలను మార్చడానికి వీలులేదు. అయితే చర్చలో ముందుగా మాట్లాడటానికి అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరుకోవడానికి వీలుంటుంది.

మరిన్ని వార్తలు