డెట్రాయిట్‌లో తానా సదస్సు

20 Mar, 2015 00:25 IST|Sakshi
డెట్రాయిట్‌లో తానా సదస్సు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 20వ సదస్సు ఈసారి డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో జూలై 2న ప్రారంభం కానుంది. సదస్సులో భాగంగా జూలై 2-4 తేదీల్లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్ పో(ఐఐఈ) నిర్వహించనున్నట్లు తానా ఇండియా కో-ఆర్డినేటర్ గారపాటి ప్రసాద్ చెప్పారు. గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐఈ పోస్టర్, వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు.
 
 అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికాలో ఉండే తెలుగు వారికి సరైన ప్రసార మాధ్యమాలు లేవని, వారిని చేరాలంటే కేవలం ఎగ్జిబిషన్లే మార్గమన్నారు. అందుకే దక్షిణ భారత దేశంలోని స్థిరాస్తి సంస్థలను ఒకే వేదిక మీద పరిచయం చేసి.. వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు గాను తొలిసారిగా ఈ ఎక్స్‌పోలో స్థిరాస్తి సంస్థల ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో బెంగళూరు, చెన్నై, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన సుమారు 30-40 నిర్మాణ సంస్థలు ప్రద ర్శనలో పాల్గొంటున్నాయన్నారు. అనంతరం ఐఐఈ ఫౌండర్, సీఈఓ రాజేష్ సుకమంచి మాట్లాడుతూ.. ఈ సదస్సుకు సుమారు 12 వేల మంది సందర్శకులొస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 సందర్శకులకు, ఎగ్జిబిటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 150 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జిబిటర్లకు సహాయపడేందుకు బూత్ సిబ్బందిని నియమించడంతో పాటు విమాన టికెట్లు, వీసా సదుపాయాలు ఏర్పాటు, ప్రీ షో ప్లానింగ్, మార్కెటింగ్ వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అనంతరం తానా ఇండియా డిప్యూటీ కో-ఆర్డినేటర్ సుబ్బారావు మాట్లాడుతూ.. సాక్షి, తెలుగు టైమ్స్ మీడియా పార్ట్‌నర్లుగా వ్యవహరించే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, నటీ, నటులు పాల్గొంటారన్నారు.
 

మరిన్ని వార్తలు