అపర చాణక్యుడు

12 Mar, 2017 02:08 IST|Sakshi
అపర చాణక్యుడు

ముందుండి నడిపించిన కమల దళపతి అమిత్‌షా

మోదీ హవా పనిచేసింది. కేంద్రం చేసిన అభివృద్ధి, చేపట్టిన పథకాలు యూపీలో బీజేపీకి విజయాన్ని సాధించిపెట్టాయి. ఏ బీజేపీ నేతను పలకరించినా చెప్పే మాటలివే. మోదీ కరిష్మా పనిచేసి ఉండొచ్చు.. కానీ అంతకంటే ఎక్కువగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఏడాదిన్నరగా తెరవెనుక చేసిన కృషి ఫలితమే కమలదళానికి యూపీలో భారీ విజయాన్ని సాధించి పెట్టింది. సామాజిక సమీకరణాల కూర్పు, ఎలాంటి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే నమ్మకస్తులకు బాధ్యతలు అప్పగించడం నుంచి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అనుబంధ విభాగాలన్నింటినీ పూర్తిస్థాయిలో ప్రచారంలో పరుగులు పెట్టించడం దాకా... ప్రతీది పక్కా ప్రణాళికతో జరిగింది.

అమిత్‌ షా గత ఏడాదికాలంలో ఎక్కువగా లక్నోలోనే గడిపారు. పార్టీ శ్రేణులను సమరోత్సాహంతో ఎన్నికల రణరంగంలో ముందుండి నడిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ ఇంచార్జిగా వ్యవహరించి ఏకంగా 71 స్థానాల్లో గెలిపించిన అమిత్‌ షా బృందం వద్ద బూత్‌స్థాయి నుంచి ఓటర్లు, సామాజిక వర్గాల లెక్కలు పక్కాగా ఉన్నాయి. కార్యక్షేత్రంలోకి దిగే ముందు రెండు సర్వేలు చేయించుకున్న కమలదళపతి వాటి ఆధారంగా ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి, ఎక్కడ బలోపేతం కావాలనేది నిర్ణయించుకొని ముందుకువెళ్లారు.

తొలుత రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులతో మొదలుపెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఓబీసీ అయిన కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను నియమించి కార్యవర్గంలో ఇదివరకు నిరాదరణకు గురైన వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. జనాభాలో ఎంతశాతం ఉన్నారనే దానితో సంబంధం లేకుండా కులాల వారీగా ప్రతి ఒక్క వర్గంతో భేటీ అయ్యారు. ఇంతకాలం నిరాదరణకు గురయ్యామనే భావన ఉన్నవారికి భరోసా ఇచ్చి వారి మద్దతును కూడగట్టారు.

బూత్‌ స్థాయి నుంచి...
1.5 లక్షల పోలింగ్‌ బూతుల్లో ప్రతి బూత్‌ పరిధిలో 20–25 చురుకైన కార్యకర్తలను గుర్తించి శిక్షణ ఇచ్చారు. బూత్‌స్థాయి నుబంచి బ్లాక్‌ స్థాయి దాకా 100 సమావేశాలను నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఏడాది కాలంలో కోటి 80 లక్షల మందికి అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యువ టౌన్‌ హాల్‌ సమావేశాన్ని నిర్వహించి 156 చోట్ల నుంచి 74 వేల మంది యువతను పలకరించారు. వాట్సాప్, ట్విటర్‌.. ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా 40 లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి ‘లోక్‌ సంకల్ప్‌ పత్ర్‌’ను విడుదల చేశారు. జన ఆకాంక్ష అనే మరో కార్యక్రమం ద్వారా సేకరించిన అభిప్రాయాల ఆధారంగానే రైతు రుణమాఫీ, మహిళల భద్రత అంశాలను బీజేపీ మెనిఫెస్టోలో చేర్చింది.

లెక్కకు మిక్కిలి సమ్మేళనాలు
ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి బీజేపీ 88 యువ సమ్మేళనాలు, 77 మహిళా సమ్మేళనాలు, 200 ఓబీసీ సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలోని నాలుగు మూలల నుంచి ప్రారంభమై లక్నోలో ముగిసిన పరివర్తన్‌ యాత్ర 8,000 కి.మీ. దూరం సాగింది. 50 లక్షల మంది ఓటర్లను ఈ యాత్ర ద్వారా కార్యకర్తలు కలుసుకున్నారు. పశ్చిమ యూపీలో తొలి రెండు దశల్లో ఓటింగ్‌ ముగిశాక.. పరిస్థితిని అంచనా వేసిన షా సోషల్‌ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఫేస్‌బుక్, ట్విటర్‌లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంకా ఎటూ నిర్ణయించుకోకుండా తటస్థంగా ఉన్న ఓటర్లను ఆకర్షించేలా ఈ ప్రచారానికి రూపకల్పన చేశారు.

ప్రశాంత్‌ కిశోర్‌ బృందానికి గాలం
లోక్‌సభ ఎన్నికల్లో మోదీతో పనిచేసి... తర్వాత దూరమైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు అమిత్‌ షా ఆరునెలల కిందటే షాకిచ్చారు. గత ఏడాది కిశోర్‌ బృందాన్ని చీల్చి ఓ 50 మందిని బీజేపీ వైపు లాగారు. ఎన్నికల వ్యూహాలు, కుల, మత సమీకరణాలు, ఓట్ల లెక్కలు, ప్రచార రూపకల్పనలో వీరందరూ కిశోర్‌ శిక్షణ పొందిన వారే.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

మరిన్ని వార్తలు