‘చట్టబద్దంగానే రామ మందిరం నిర్మాణం’

23 Jul, 2017 13:21 IST|Sakshi
‘చట్టబద్దంగానే రామ మందిరం నిర్మాణం’

జైపూర్‌: అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చాలా సంవత్సరాల నుంచి చర్చలో ఉంది. తాము అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ చాలాసార్లు చెప్పింది. ఈ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మరోసారి పార్టీ అభిప్రాయాన్ని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన రాజస్థాన్‌ వెళ్లారు. జైపూర్‌లో  ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిరం పరస్పర చర్చల తర్వాత చట్టబద్దంగా నిర్మించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

గత నాలుగు లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో తమ పార్టీ ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలలో బాగా సంపాదించిన కుటుంబాలను రిజర్వేషన్‌ ప్రయోజనాల నుంచి మినహాయించాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలనే విషయం అన్ని పార్టీలతో చర్చించి తరువాతనే ఎన్నికల కమిషన్‌ తో మాట్లాడుతామన్నారు.  

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలనే తాము కోరుకుంటున్నామని అమిత్‌ షా తెలిపారు. బీజేపీకి ఈ విషయంపై నమ్మకం ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్ని రాజకీయ పార్టీలతో  ఈ విషయంపై చర్చలు జరుపుతారని ఆయన అన్నారు. అంతేకాక బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అంశాలను ఆయన  గుర్తు చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, షెల్‌ కంపెనీల ముసివేసిన అంశాలను గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో జీఎస్టీ అమలును బీజేపీ వ్యతిరేకించలేదని ఆయన పేర్కొన్నారు.

జీఎస్‌టీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. వారు చేసిన డిమాండ్‌లను మేము అంగీకరించామూ, కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలు మాతోనే ఉన్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో ఆందోళన చేశాయి. కానీ దేశంలోని ప్రజలు దీనిని అంగీకరించారని ఆయన తెలిపారు. గో సంరక్షణ పై ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని తీసుకరానుందనే ప్రశ్నకు.. బీజేపీ పాలన ఉన్న రాష్ట్రాలలో ఇప్పటికే ఇటువంటి చట్టాలు అమలులో ఉన్నాయని అమిత్‌ షా తెలిపారు.
 

మరిన్ని వార్తలు