ఉద్యోగులకు కరువు భత్యం పెంపు

10 Sep, 2015 01:55 IST|Sakshi
ఉద్యోగులకు కరువు భత్యం పెంపు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
 
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు కరువు భత్యం (డీఏ) ప్రకటించింది. ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న 4.50 లక్షల మంది ఉద్యోగులు ఈ ప్రయోజనం అందుకోనున్నారు. పదో పీఆర్‌సీ వేతన సవరణ అనంతరం ఉద్యోగులకు మూల వేతనంపై 8.908 శాతం డీఏ అమల్లో ఉంది. దీనికి అదనంగా 3.144 శాతం కలిపి 12.052 శాతం డీఏ చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఈ ఏడాది జనవరి నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుంది. ఈమేరకు బుధవారం ఆర్థిక శాఖ జీవో 129 జారీ చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ నెల జీతంతో పెరిగిన కరువు భత్యాన్ని నగదుగా చెల్లిస్తారు. అంటే అక్టోబర్ 1న పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికందుతుంది. జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు.

మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్‌ఏఎన్) అకౌంట్‌లో జమ చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు వంద శాతం బకాయిలు నగదు రూపంలోనే చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులున్నట్లయితే... వారి డీఏ బకాయిలను ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు. బకాయిలకు సంబంధించి ఈనెల 15లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. తమ పరిధిలోని ఉద్యోగులందరూ డీఏ బకాయిలు క్లెయిమ్ చేసినట్లుగా డీడీవోలు ధ్రువీకరణ పత్రం జత చేస్తేనే... సెప్టెంబర్ వేతన బిల్లులు పాస్ చేయాలని ఆదేశించింది. పెన్షనర్లకు సంబంధించిన డీఏ పెంపు ఉత్తర్వులను ప్రభుత్వం  ఇంకా విడుదల చేయలేదు.

 కొత్త డీఏ 3.144 శాతం
 కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల కిందట పెంచిన డీఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డీఏను ప్రకటించింది. ఇదే రోజున కేంద్ర కేబినెట్ జూలై నుంచి ఉద్యోగుల డీఏను ఆరు శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఉద్యోగులకు మరో 3.144 శాతం డీఏ పెరుగుతుంది. రాష్ట్ర సర్కారు తీసుకునే నిర్ణయం ప్రకారం తదుపరి డీఏ ప్రకటన వెలువడుతుంది. కనీసం నాలుగైదు నెలల ఎదురుచూపులు ఆనవాయితీగా కొనసాగుతోందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
 
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు