ఆంధ్రజ్యోతికి ఏపీ ప్రభుత్వం గిఫ్ట్‌

30 Jun, 2017 08:25 IST|Sakshi
ఆంధ్రజ్యోతికి సర్కార్‌ బహుమానం

రూ.15 కోట్ల విలువైన భూమి రూ.50 లక్షలకే...
విశాఖపట్నం పరదేశిపాలెంలో 1.5 ఎకరాలు కేటాయింపు


విశాఖపట్నం‌: ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చెందిన ఆమోదా పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం విలువైన భూమిని కారుచౌకగా కేటాయించింది. విశాఖపట్నం శివారు పరదేశిపాలెంలో రూ.15 కోట్ల విలువైన ఒకటిన్నర ఎకరాల భూమిని కేవలం రూ.50 లక్షలకే ఇచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కరికాల వళవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎకరా రూ.10 వేలకే ఇవ్వాలని ‘ఆమోదా’ ఒత్తిడి

ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు 1986లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖపట్నం శివారు పరదేశిపాలెం గ్రామ పరిధిలో సర్వే నం.191, 168లలో ఎకరా రూ.10 వేల ధరకే 1.50 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, జాతీయ రహదారి విస్తరణ కోసం ఇందులో ఎకరా భూమిని వెనక్కి తీసుకుంది. మిగిలిన 50 సెంట్ల భూమి అప్పటి నుంచి ఆంధ్రజ్యోతి సంస్థ అధీనంలోనే ఉంది. జాతీయ రహదారి విస్తరణ కోసం తీసుకున్న ఎకరా భూమికి ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి అధీనంలో ఉన్న 50 సెంట్ల భూమికి గాను సదరు సంస్థ నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయలేదు. జాతీయ రహదారి విస్తరణ కోసం స్వాధీనం చేసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని, పైగా 1986లో తమకు కేటాయించిన విధంగానే ఎకరా రూ.10 వేల చొప్పునే కేటాయించాలంటూ ఆంధ్రజ్యోతి యాజమాన్యం తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది.

జీవో 571 ప్రకారం తాము కోల్పోయిన ఎకరా స్థలాన్ని తమకు పాత ధరకు కేటాయించాలని ఆమోదా పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విశాఖ జిల్లా కలెక్టర్‌ను కోరింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం అదే ప్రాంతంలో ఎకరా 50 సెంట్ల భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించింది. గత కలెక్టర్‌ యువరాజ్‌ ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉందని, ఇక్కడ మార్కెట్‌ విలువ ఎకరా రూ.7.26 కోట్లుగా నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. గతేడాది ఆగస్టు 10న, అక్టోబర్‌ 4న ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రివైజ్డ్‌ నివేదిక పంపించారు. ఆ నివేదికలోనూ ఎకరా ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.7.26 కోట్లు ఉందని, ఆ ధరకే కేటాయించాల్సిందిగా ప్రతిపాదనలను పంపారు. పరదేశీపాలెంలో సర్వే నంబర్‌ 191/10 నుంచి 191/14లో అందుబాటులో ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఆమోదా పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కరికాల వళవన్‌ బుధవారం జీవో ఎంఎస్‌.25ను జారీ చేశారు.

50 సెంట్ల భూమిని పాత ధర కింద ఎకరా రూ.10 వేల చొప్పున ఇవ్వడానికి, ప్రత్యామ్నాయంగా ఇస్తున్న ఎకరా భూమిని ఎకరా రూ.50 లక్షల చొప్పున కేటాయించాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే 50 సెంట్ల విలువ కేవలం రూ.5 వేలేనన్న మాట. మూడేళ్లలో భూమిని ఉపయోగించాలని, ఆ భూమిలో వాటర్‌ బాడీస్‌ (చెరువులు, గెడ్డలు)రూపు మార్చకూడదని స్పష్టం చేశారు. సంబంధిత అవసరాలకే వినియోగించాలని, వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని పేర్కొన్నారు.

ప్రతి ఏడాది మార్చి 31వ తేదీకల్లా ఈ భూమి వినియోగంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. లేకుంటే భూమిని వెనక్కి తీసుకునే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పరదేశిపాలెంలో ఎకరా రూ.10 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన రూ.15 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.50,05000కు కట్టబెట్టారు. ఈ భూమి కేటాయింపులో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు