విభజనపై రాజపత్రం

3 Mar, 2014 02:00 IST|Sakshi
విభజనపై రాజపత్రం

* రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం గెజిట్ ప్రచురణ
* మార్చి 1వ తేదీనే న్యాయశాఖ అసాధారణ గెజిట్ జారీ
* విభజన అమలు తేదీ (అపాయింటెడ్ డే)కి మరో గెజిట్
 
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2014కు రాష్ట్రపతి రాజముద్ర వేయటంతో అది చట్టరూపంలోకి వచ్చింది. ఇకపై దీనిని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014గా పరిగణిస్తారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ (శాసనవ్యవస్థ విభాగం) అసాధారణ గెజిట్‌ను ప్రచురించింది. రాష్ట్రపతి ఆమోదించిన మార్చి 1వ తేదీతోనే ఈ గెజిట్ నంబరును 06/2014గా పేర్కొంది. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన 9 రోజులకు చట్టం నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ అవతరణ తేదీ (అపాయింటెడ్ డే)ని కేంద్ర ప్రభుత్వం మరో ప్రత్యేక గెజిట్ ద్వారా ప్రకటిస్తుంది. ఆ రోజు నుంచి రెండు రాష్ట్రాలు మనుగడలోకి వస్తాయి. ఈ చట్టంలోని ముఖ్యాంశాలివీ...

భౌగోళిక విభజన ఇలా
తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంది. అయితే.. ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు (2005 జూన్ 27వ తేదీన జారీ చేసిన జీవో 111లో పేర్కొన్న మండలాల్లోని రెవెన్యూ గ్రామాలతో పాటు.. భూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సీతారామనగరం, కొండ్రెక రెవెన్యూ గ్రామాలు) సీమాంధ్ర ప్రాంతంలో ఉంటాయి. (అయితే.. పోలవరం ముంపు ప్రాంతంలో పునరావాసం సమస్య పరిష్కారానికి.. ఖమ్మం జిల్లాలోని మరికొన్ని గ్రామాలను కూడా సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు ఆదివారం సాయంత్రం కేంద్రమంత్రి జైరాంరమేష్ ప్రకటించారు) పోలవరం ముంపు గ్రామాలతో పాటు.. మిగిలిన 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతుంది.

పదేళ్లు ఉమ్మడి రాజధాని
ఈ రెండు రాష్ట్రాలకూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రాంతం పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఉంటుంది. విభజన చట్టం నోటిఫికేషన్ తేదీ నుంచి ఆరు నెలలల్లోగా సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటుపై వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసి, తగిన సిఫారసులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమిస్తుంది.

రెండు రాష్ట్రాలకూ ఒకే గవర్నర్
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అపాయింటెడ్ డే రోజున ఉండే గవర్నర్.. ఆ రోజు నుంచి రాష్ట్రపతి సూ చించిన గడువు తేదీ వరకు 2 రాష్ట్రాలకూ గవర్నర్‌గా వ్యవహరిస్తారు. ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలక సంస్థల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ తదితర అంశాలు గవర్నర్ అధికార పరిధిలో ఉంటాయి. ఈ అంశాల్లో గవర్నర్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సలహాను తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. స్వీయ విచక్షణాధికారంతో సొంతంగా తీసుకోవచ్చు. దీనిని ప్రశ్నించటానికి అవకాశం లేదు. గవర్నర్‌కు సహాయకులుగా కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది.

పోలీసు బలగాల విభజన
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అదనపు పోలీసు బలగాలను సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది. హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం విభజన తేదీ నుంచి మూడేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, నిర్వహణలో ఉంటుంది. ఈ మూడేళ్ల కాలం రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి శిక్షణ కేంద్రంగా పనిచేస్తుంది. గడువు ముగిసిన తర్వాత నుంచి ఇది తెలంగాణ రాష్ట్ర శిక్షణ కేంద్రం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రం గుర్తించిన ప్రాంతంలో ఆ రాష్ట్రానికి అధునాతన గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయటానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలను.. సిబ్బంది అభీష్టాలు తెలుసుకుని రెండు రాష్ట్రాలకూ పంపిణీ చేస్తారు.

నియోజవరర్గాల విభజన
అపాయింటెడ్ డే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 11 రాజ్యసభ స్థానాలు, తెలంగాణకు 7 రాజ్యసభ స్థానాలు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 25 లోక్‌సభ స్థానాలు, తెలంగాణకు 17 లోక్‌సభ స్థానాలు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 175, తెలంగాణకు 119 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. తదుపరి నియోజకవర్గాల పునర్విభజన సమయంలో తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలను 153 కు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225 కు పెంచుతారు.

కొంత కాలం ఉమ్మడి హైకోర్టు
విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టు నిర్మాణం జరిగేవరకు హైదరాబాద్‌లోని ప్రస్తుత హైకోర్టు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంటుంది. అపాయింటెడ్ డేకు ముందు రోజున హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నవారు అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా ఉంటారు. విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నిర్ణయించిన ప్రాంతంలో హైకోర్టు ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అది ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా ఉంటుంది.

ఆస్తులు, అప్పుల పంపిణీ
అపాయింటెడ్ డే నుంచి.. తెలంగాణ భూభాగంలో ఉన్న భూమి, ఇతర ఆస్తులు తెలంగాణకు చెందుతాయి. మిగిలినవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కొనసాగుతాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల గల ఆస్తులను జనాభా నిష్పత్తి (2011 జనాభా లెక్కల ప్రకారం 58.32 : 41.68 నిష్పత్తి) ప్రకారం పంపిణీ చేస్తారు. ఆస్తులు, అప్పుల పంపిణీపై వివాదాలు తలెత్తితే ఉమ్మడి ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవాలి. లేదంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సలహాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా పరిష్కరిస్తుంది.

నదీజలాల నిర్వహణకు బోర్డులు
నదీ జలాల పంపకానికి సంబంధించి.. గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డు, కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అపాయింటెడ్ డే నుంచి 60 రోజుల్లోగా వీటి ఏర్పాటు జరుగుతుంది. గోదావరి బోర్డు తెలంగాణలో, కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది. ఈ రెండు బోర్డుల పనితీరును పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి మండలి (అపెక్స్ కౌన్సిల్)ను ఏర్పాటు చేస్తుంది. దీనిక చైర్‌పర్సన్‌గా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు.

మరిన్ని వార్తలు