ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకు

4 Dec, 2013 02:01 IST|Sakshi
ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకు

* సలహాల కోసం త్వరలో అఖిలపక్షం... రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
* బీసీ క్రీమీలేయర్ వార్షిక ఆదాయ పరిమితి రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంపు
* మావోయిస్టుల దాడుల్లో మృతి చెందినవారి కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం పెంపు
* జీహెచ్‌ఎంసీలో అక్రమ నిర్మాణాల నివారణకు ట్రిబ్యునల్
* జంటనగరాలకు గోదావరి జలాల తరలింపునకు హడ్కో నుంచి రూ. 1,000 కోట్ల రుణం
* చిత్తూరు మంచినీటి పథకానికి అమోదం
 
 సాక్షి, హైదరాబాద్: 
కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అలాగే బీసీల్లో సంపన్న శ్రేణి వార్షిక ఆదాయ పరిమితిని రూ.4.5 లక్షల రూ.6 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది. సుమారు 75 రోజుల అనంతరం జరిగిన ఈ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్ ఇటీవలి తీర్పుపై చర్చించారు. గతంలో తీసుకున్న పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి డి.కె.అరుణ విలేకరులకు వెల్లడించారు.

 

‘బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ఈ విషయమై త్వరలోనే అఖిల పక్ష సమావేశం నిర్వహించి అందరి సలహాలు తీసుకోవాలి..’ అని కేబినెట్ నిర్ణరుుంచింది. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల నిరోధానికి బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, ఇందుకు చట్టంలో సవరణలు తీసుకురావాలని తీర్మానించింది. పట్టణాలు, నగరాల్లో వ్యాపార ప్రకటనల నియంత్రణకు పురపాలక వ్యాపార ప్రకటనల విధానం తీసుకువచ్చేందుకు చట్టంలో సవరణలు చేయనున్నారు. చిత్తూరు జిల్లాలో రూ.4,300 కోట్ల వ్యయంతో చేపడుతున్న మంచినీటి పథకానికి గతంలో జారీచేసిన పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మావోయిస్టు దాడుల్లో మృతి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ల కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న పరిహారాన్ని రూ.15 లక్షల  నుంచి రూ.35 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

 

శాశ్వత అంగవికలురైతే ఇచ్చే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు, తీవ్ర గాయాలకు గురైతే పరిహారాన్ని రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచారు. మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచారు. శాశ్వతంగా అంగవికలురైతే రూ.10 లక్షల పరిహారం ఇస్తారు. తీవ్రంగా గాయపడితే ప్రస్తుతం ఇస్తున్న రూ.లక్ష పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచారు. పౌరులు మరణిస్తే ఇస్తున్న పరిహారాన్ని రూ.5 లక్షల  నుంచి రూ.10 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవికలురైతే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందితే ప్రస్తుతం కుటుంబానికి ఇస్తున్న పరిహారాన్ని రూ.9 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవికలురైతే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.2.40 లక్షల  నుంచి రూ.3 లక్షలకు పరిహారం పెంచారు. ఇన్‌స్పెక్టర్, ఆ పైస్థాయి అధికారులు మరణిస్తే పరిహారాన్ని రూ.12 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవికలురైతే రూ.3.60 లక్షల నుంచి రూ.10 లక్షలకు, తీవ్రంగా గాయపడితే 2.40 లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలకు పరిహారాన్ని పెంచారు.


 13 ప్రభుత్వ శాఖల్లో 14,115 పోస్టుల భర్తీ
 13 ప్రభుత్వ శాఖల్లో మొత్తం 14,115 పోస్టులను భర్తీ చేయూలని మంత్రివర్గం నిర్ణరుుంచింది. జంటనగరాలకు గోదావరి జలాలు తరలింపు పథకానికి హడ్కో నుంచి రూ.1000 కోట్ల రుణం తీసుకోనుంది. ఆర్టీసీ రూ.320 కోట్ల రుణం తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. కాపులను బీసీల్లో చేర్చడానికి సర్వే నిమిత్తం రూ.65 లక్షలు విడుదల చేయాలని నిర్ణరుుంచింది. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం కేటాయించిన భూములపై యాజమాన్య హక్కులను ఇతరులకు బదలాయించేందుకు ఆ కంపెనీలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు, రుణాల రీ షెడ్యూల్‌కు త్వరలో బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణరుుంచింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటునకు ఏపీఐఐసీకి 1473 ఎకరాలను మార్కెట్ ధరపై పది శాతం అదనంగా లీజుకు కేటాయించనున్నారు.


 గేమింగ్ పాలసీకి ఆమోదముద్ర
 ఆంధ్రప్రదేశ్ గేమింగ్, యానిమేషన్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పాలసీ 2014-19కి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా తొలుత రాజధానిలో యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి ఏపీఐఐసీ స్థలం సమకూరుస్తుంది. ఈ సిటీలో కంపెనీలు పూర్తిగా కార్యకలాపాలు నిర్వహించేలా మౌలిక వసతులు సమకూరుస్తారు. కంపెనీలకు స్థలాలు, కార్యాలయ భవనాలను కొన్ని పరిమితులకు లోబడి రాయితీపై కేటాయిస్తారు. తరువాత టైర్-2 నగరాలైన విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి, వరంగల్ నగరాల్లోనూ ఇదే తరహాలో గే మింగ్ సిటీని అభివృద్ధి పరుస్తారు.

>
మరిన్ని వార్తలు