చంద్రబాబే ఉద్యమంలోకి దుష్ట శక్తులను జొప్పించారు

1 Feb, 2016 04:34 IST|Sakshi
చంద్రబాబే ఉద్యమంలోకి దుష్ట శక్తులను జొప్పించారు

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కాపు ఉద్యమంలోకి దుష్టశక్తులను జొప్పించి తుని దౌర్జన్యకర సంఘటనలకు కారకులయ్యారని, ఇందుకు ఆయనదే పూర్తి బాధ్యత అని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు తుని ఘటనలపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఉద్యమాల్లోకి దుష్టశక్తులను జొప్పించి దానిని నీరుగార్చడం ఆయనకు అల వాటేనన్నారు. ఇప్పుడు కూడా అలాగే చేశారన్నారు. ఎక్కడ ఏం జరిగినా జగన్‌పై అభాండాలు వేయడం ఏ మాత్రం సరికాదని చెప్పారు. జీతాలు చెల్లించడానికే నిధులు లేనందువల్ల రూ.100 కోట్లే కేటాయించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు.

విజయవాడ, హైదరాబాద్ మధ్య తిరగడానికే ప్రత్యేక విమానాల కోసం వందలాది కోట్లు వెచ్చించారని, ఇష్టానుసారం ఆడంబరాలకు ఖర్చు చేస్తూ కాపులకు ఇవ్వడానికే నిధులు లేవని చెప్పడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుష్కరాలు, పట్టిసీమ, చంద్రన్న కానుక పేరుతో వందల కోట్లు తగలేసిన ముఖ్యమంత్రికి కాపులకు ఇవ్వడానికే నిధులుండవా అని ప్రశ్నించారు. తునిలో జరిగిన సంఘటనలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు.

ఎన్నికల మేనిఫెస్టోలో నిర్ణీత కాల వ్యవధిలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మాట ఇచ్చి నెరవేర్చనందు వల్లనే ఆ వర్గంలో అశాంతి చెలరేగిందని పేర్కొన్నారు. కాపుల సంక్షేమానికి ఏడాదికి రూ.1000 కోట్లు కేటాయిస్తానని చెప్పి గత 20 నెలల పాలనలో రూ.100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. పెపైచ్చు ముఖ్యమంత్రితో సహా అందరూ రెచ్చగొట్టేలా మాట్లాడ్డమే తప్ప.. మేమున్నామంటూ ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ కాపుల కు నచ్చజెప్పి వారిలో స్థైర్యం నింపే యత్నం చేయలేదన్నారు. తునిలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమన్నారు.

సంయమనం పాటించాలని తమ పార్టీ అందరినీ కోరుతోందని చెప్పారు. కాపు గర్జన జరిగిన ఉభయగోదావరి జిల్లాల ప్రాంతం ఎక్కువగా వ్యవసాయాధారితమైనదని, చంద్రబాబు విధానాలపై అక్కడి రైతులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. అన్ని రకాల అసంతృప్తులూ తుని సంఘటనలకు కారణమన్నారు. తుని సంఘటనలకు తన వైఖరే కారణమనే విషయం గుర్తించకుండా ఇంకా ఈ ఘటనలను కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న వారు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి డబ్బులున్నాయా?: అంబటి రాంబాబు
కాపులకు ఇవ్వడానికి నిధులు లేవని సాకులు చెబుతున్న చంద్రబాబునాయుడుకు.. పారిశ్రామికవేత్తలకు రూ.2,500 కోట్ల సబ్సిడీ బకాయిలు చె ల్లించడానికి మాత్రం డబ్బులున్నాయా అని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన వ్యక్తి ఇపుడు వంద కోట్లే కేటాయించి జీతాలకు డబ్బు లేవని చెబుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి తెలియకుండానే చంద్రబాబు హామీలు ఇచ్చారా అని అడిగారు. పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ బకాయిలు చెల్లించి 400 కోట్లు దోచుకోలేదా అని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపన కోసం రూ.400 కోట్లు దుబారాగా ఖర్చు చేయడానికి, ప్రత్యేక విమానాల్లో తిరగడానికి మాత్రం డబ్బులున్నాయా అన్నారు. విచ్చలవిడిగా అయిన దానికీ కాని దానికీ వేల కోట్లు తగలేస్తున్న చంద్రబాబు కాపుల వద్దకు వచ్చేటప్పటికే నీతులు చెబుతారా అని విమర్శించారు. తునిలో జరిగిన సంఘటనలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ ఘటనలకు అధికారపక్షం అందరిపైనా ఆరోపణలు చేసే బదులు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని అంబటి హితవు పలికారు.

మరిన్ని వార్తలు