ఆంధ్రప్రదేశ్లో డ్రాపవుట్ల రేటెంతో తెలుసా?

12 Dec, 2016 14:37 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్లో డ్రాపవుట్ల రేటెంతో తెలుసా?
యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యూ-డీఐసీఈ) ప్రకారం 2015-16లో ప్రాథమిక, మాధ్యమిక విద్యాస్థాయిలో సగటు వార్షిక డ్రాపవుట్ రేటు 4.10 శాతం, 17.06శాతంగా ఉన్నాయని మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. ఈ డ్రాపవుట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో 6.18 శాతం, మాధ్యమిక స్థాయిలో 15.71శాతంగా ఉన్నట్టు చెప్పారు. 2015-16లో ఆంధ్రప్రదేశ్లో ఏ పాఠశాల మూత పడలేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 37శాతానికి పెరిగిన స్కూల్ డ్రాపవుట్లపై ప్రశ్నోత్తరాల సదర్భంగా వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఉపేంద్ర కుష్వాహా ఈ మేరకు వివరాలను లిఖిత పూర్వకంగా అందించారు.  
 
పాఠశాల ప్రారంభం, మూత అనేది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనపై ఆధారపడి ఉంటాయని ఉపేంద్ర కుష్వాహా స్పష్టీకరించారు. సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సార్వజనీకరణ ప్రాథమిక విద్యను అందించే విషయంలో మాత్రం తాము హామీని ఇ‍వ్వగలమన్నారు. ప్రాథమిక విద్యను అందించడానికి 2016 జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,156 కొత్త ప్రాథమిక పాఠశాలలు, 4,256 కొత్త ప్రాథమికోన్నత పాఠశాలు, 69,706 అదనపు తరగతి గదులను మంజూరు చేసినట్టు వెల్లడించారు.
 
అదనంగా 352 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను కూడా మంజూరు చేసినట్టు చెప్పారు. పాఠశాలలు ఏర్పాటుచేయడానికి అవసరమైన భూమి లేని ప్రాంతాల పిల్లలకు ఎస్ఎస్ఏ కింద గురుకుల పాఠశాలలు/వసతి గృహాలు ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. పాఠశాలల్లో డ్రాపవుట్ అవుతున్న పిల్లలకు, మురికివాడల్లో నివసించే పిల్లలకు, బాలవర్కర్లకు తాము ప్రత్యేక శిక్షణ ఇచ్చి, పాఠశాలల్లో చేర్పిస్తున్నామన్నారు.
మరిన్ని వార్తలు