2013 అమ్మకాలు బేకార్

10 Jan, 2014 01:34 IST|Sakshi

న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు గతేడాది 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీర్ఘకాలంగా ఉన్న మందగమనం కారణంగా 2013లో కార్ల విక్రయాలు 9.59 శాతానికి క్షీణించాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ(సియామ్) డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్  పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం...,
 

  • 2012లో 19,98,703గా ఉన్న దేశీయ కార్ల విక్రయాలు గతేడాది 18,07,011కు పడిపోయాయి. ఈ స్థాయి క్షీణత 2002 తర్వాత ఇదే మొదటిసారి.
  • {దవ్యోల్బణం, వడ్డీరేట్లు, ఇంధనం ధరలు, ఇవన్నీ పెరుగుతుండడం అమ్మకాలపై ప్రభావం చూపాయి. ప్రస్తుతమున్న ఆర్థిక స్థితిగతుల కారణంగా ప్రతికూల సెంటిమెంట్ మరింత పెరిగింది.
  • గత 17 నెలల్లో కేవలం మూడు నెలల్లో మాత్రం కార్ల అమ్మకాలు పెరిగాయి. 2012లో అక్టోబర్‌లో, 2013లో ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో మాత్రమే కార్ల విక్రయాలు వృద్ధి చెందాయి.  మౌలిక ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడం, మైనింగ్ కార్యకలాపాలు స్తంభించిపోవడం వంటి కారణాల వల్ల వాణిజ్య వాహనాల అమ్మకాలు భారీ స్థాయిలో తగ్గిపోయాయి.
  • ఈ ఏడాది జూలై తర్వాత వాణిజ్య వాహనాల అమ్మకాలు పుంజుకోవచ్చు. అలాగే ప్రయాణికుల వాహనా విక్రయాలు కూడా కాస్త మెరుగుపడవచ్చు.
  • గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ 22 కొత్త కార్ల మోడళ్లు, 40 వేరియంట్లు, 10 మోడల్ రిఫ్రెష్‌లు మార్కెట్లోకి వచ్చాయి.
  • గత నెలలో మారుతీ అమ్మకాలు 6.4 శాతం, హ్యుందాయ్ అమ్మకాలు 6.2%, హోండా కార్స్ అమ్మకాలు 29 శాతం చొప్పున పెరిగాయి. టాటా మోటార్స్ అమ్మకాలు 42 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 27 శాతం తగ్గాయి.
  • డిసెంబర్‌లో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 5 శాతం తగ్గాయి. యుటిలిటి వెహికల్ విక్రయాలు 10.44 శాతం, వ్యాన్ల అమ్మకాలు 36 శాతం,  భారీ, మధ్య తరహా, తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు 28 శాతం తగ్గాయి. త్రీ వీలర్ల అమ్మకాలు 21 శాతం తగ్గాయి.
  • ఇక మోటార్ సైకిళ్ల అమ్మకాలు 4 శాతం తగ్గగా, స్కూటర్ల అమ్మకాలు 30 శాతం పెరిగాయి. మొత్తం మీద టూవీలర్ల అమ్మకాలు 2 శాతం పెరిగాయి.  హీరో మోటోకార్ప్ అమ్మకాలు 4 శాతం, బజాజ్ ఆటో అమ్మకాలు 32 శాతం తగ్గగా, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు మాత్రం 22 శాతం పెరిగాయి.
  • మొత్తం అన్ని వాహనాల విక్రయాలు 14,49,203 నుంచి 1.21 శాతం క్షీణించి 14,31,632కు తగ్గిపోయాయి.
  • మొత్తం ఎగుమతులు 2,61,920 నుంచి 10 శాతం క్షీణించి 2,88,525కు పెరిగాయి.

మరిన్ని వార్తలు