బతికున్న శిశువును చనిపోయిందన్నారు

14 Sep, 2016 01:11 IST|Sakshi
బతికున్న శిశువును చనిపోయిందన్నారు

- డెత్ సర్టిఫికెట్ సైతం ఇచ్చేశారు..
- పూడ్చిపెట్టేందుకు వెళుతుండగా మార్గమధ్యలో శిశువులో కదలిక
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందు
- గుంటూరు జీజీహెచ్‌లో మరో దారుణం
 
 గుంటూరు మెడికల్: బతికున్న శిశువును చనిపోయిందంటూ చెప్పడమే కాదు.. ఆ మేరకు ధ్రువీకరణ పత్రం సైతం ఇచ్చేశారా వైద్యులు. పుట్టిన బిడ్డ పోయాడన్న పుట్టెడు శోకంతో ఆటోలో ఇంటికి మరలిన ఆ కుటుంబ సభ్యులకు మార్గమధ్యలో శిశువులో కదలికలు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆలస్యం చేయకుండా వెనువెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో నాలుక్కరుచుకున్న వైద్యులు హడావుడిగా శిశువును ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. ఇదంతా ఎక్కడో కాదు.. పసికందును ఎలుకలు కొరికిన దుర్ఘటనతో మాయనిమచ్చ పడిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్)లోనే చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ మండల పరిధిలోని దాసరిపాలేనికి చెందిన జగన్నాథం నాగబాబు ఆటోడ్రైవర్. అతని భార్య భవానికి పురుటి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం ఆరు గంటలకు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు సాధారణ కాన్పు చేయగా ఉదయం 7.20 గంటలకు మగబిడ్డ పుట్టాడు. దీంతో కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు.

అయితే అరగంట వ్యవధిలోనే వైద్యులు బిడ్డ చనిపోయాడని చెప్పారు. ఆస్పత్రిలో బిడ్డను పడేయకుండా ఇంటికి తీసుకెళ్లమంటూ వస్త్రాల్లో చుట్టి తండ్రికి అప్పగించారు. డెత్ సర్టిఫికెట్ ఇచ్చి మరీ అప్పగించడంతో పసికందును పూడ్చేందుకు గుంత తవ్వించాలని బంధువులకు నాగబాబు ఫోన్ చేశాడు. అయితే వారు ఆటోలో తమ గ్రామానికి వెళుతుండగా శిశువులో కదలికలు వచ్చాయి. దీంతో తక్షణమే ఆటోను వెనుకకు తిప్పుకుని ఆస్పత్రికి వచ్చారు. జరిగిన తప్పిదాన్ని గ్రహించిన ఆస్పత్రి సిబ్బంది హడావుడిగా శిశువును ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. కాగా బతికున్న బిడ్డను చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులపై తక్షణమే  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పసికందు కుటుంబ సభ్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్ ముందు మూడుగంటలకుపైగా ధర్నా చేశారు. ఆర్‌ఎంఓ డాక్టర్ యనమల రమేశ్ వచ్చి.. వైద్యులపై విచారణ కమిటీవేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో వారు ధర్నా విరమించారు. నాగబాబు మాట్లాడుతూ.. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తాము తీరని వేదనను అనుభవించాల్సి వచ్చిందన్నారు.

>
మరిన్ని వార్తలు