మైక్రోసాఫ్ట్ సీఈవో రేసులో మరో భారతీయుడు

3 Feb, 2014 00:29 IST|Sakshi
మైక్రోసాఫ్ట్ సీఈవో రేసులో మరో భారతీయుడు

 తాజాగా వినిపిస్తున్న పేరు: సుందర పిచ్చయ్య
 జన్మ స్థలం:    చెన్నై, వయస్సు-42 ఏళ్లు
 ప్రస్తుత హోదా:    గూగుల్ ఆండ్రాయిడ్ విభాగం చీఫ్
 చదువు:    ఐఐటీ-ఖరగ్‌పూర్, పీజీ-స్టాన్‌ఫోర్డ్
 
 న్యూయార్క్: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) పదవికి మరో భారతీయుడు పోటీ పడుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. చెన్నైకు చెందిన 42ఏళ్ల సుందర పిచ్చయ్య పేరు వెలుగులోకి వచ్చినట్లు సిలికాన్ యాంగిల్ అనే మీడియా వెబ్‌సైట్ పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన సత్య నాదెళ్ల రేసులో ముందంజలో ఉన్నట్లు వార్తలు రావడం తెలిసిందే. కాగా, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ... ఆండ్రాయిడ్, క్రోమ్, ఆప్స్‌కు హెడ్‌గా పనిచేస్తున్న పిచ్చయ్య సైతం రేసులోకి వచ్చినట్లు సమాచారం. పిచ్చయ్యకు చాన్స్ ఇవ్వడం ద్వారా క్లౌడ్, మొబైల్, సోషల్ విభాగాలలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయవచ్చన్నది మైక్రోసాఫ్ట్ ఆలోచనగా సిలికాన్ ఏంగిల్ విశ్లేషించింది. అయితే సత్య మైక్రోసాఫ్ట్‌లో ఇప్పటికే వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించగా, పిచ్చయ్య ప్రస్తుతం గూగుల్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. పిచ్చయ్య ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి టెక్నాలజీ డిగ్రీ పూర్తిచేయగా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశా రు.  పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆండ్రాయిడ్ విజయం నేపథ్యంలో ట్విటర్ వంటి దిగ్గజాల నుంచి పిచ్చయ్యకు భారీ డిమాండ్ ఉంని సిలికాన్ ఏంగిల్ పేర్కొంది. దీంతో గూగుల్‌లో కొనసాగేందుకు 5 కోట్ల డాలర్లను అందుకుంటున్నట్లు వెల్లడించింది.
 
 సీఈఓగా మూడో వ్యక్తి...
 38 ఏళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ చరిత్రలో ఇంత వరకూ ఇద్దరు మాత్రమే సీఈవోలుగా పనిచేయడం గమనార్హం. కంపెనీ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తరువాత కంపెనీ పగ్గాలు ప్రస్తుత చీఫ్ స్టీవ్ బామర్‌కు దక్కాయి. తాజాగా ఈ వారంలో మూడో వ్యక్తి కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఈ టాప్ పోస్ట్‌కు రేసులో ఇద్దరు భారతీయులు పోటీపడటం చెప్పుకోదగ్గ విశేషం!
 

మరిన్ని వార్తలు