-

శశికళకు షాక్: ఉన్నతాధికారులు పీఛేముడ్‌

7 Feb, 2017 14:13 IST|Sakshi
శశికళకు షాక్: ఉన్నతాధికారులు పీఛేముడ్‌

తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలోకి కొత్తగా వద్దామని అనుకుంటున్న శశికళా నటరాజన్‌కు వరుసపెట్టి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఒకవైపు పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి వీల్లేకుండా గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబైలోనే ఉండిపోతే, మరోవైపు జయలలిత హయాంలో ఉన్నతస్థానాల్లో పనిచేసిన పలువురు అధికారులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. గత డిసెంబర్ నెలలోనే నియమితులైన ఇంటెలిజెన్స్ చీఫ్ సత్యమూర్తి ఉన్నట్టుండి సెలవులో వెళ్లిపోయారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, జయలలితకు సలహాదారుగా ఉన్న షీలా బాలకృష్ణన్ నైతం అదే పని చేశారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్న సుదీర్ఘకాలంలో పాలనా వ్యవహారాలు అన్నీ సజావుగా నడిచేలా చూసింది ఈమే. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసి, ప్రస్తుతం హోం శాఖ కార్యదర్శిగా ఉన్న శాంతా షీలా నాయర్‌ సైతం తన పదవి నుంచి తప్పుకోడానికి సిద్ధపడ్డారు. తనను విధుల నుంచి తప్పించాలని తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి ఆమె లేఖ రాశారు. జయలలితకు అప్పట్లో ఈమె కూడా అత్యంత ఆప్తురాలు. ముఖ్యమంత్రి వద్ద పనిచేసిన నలుగురు కార్యదర్శులలో ఇద్దరు కూడా తప్పుకొన్నారు. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేలుచేసే పథకాలు ప్రవేశపెట్టడం, వాటిని సమర్థంగా అమలుచేయడంలో ఈ ఉన్నతాధికారులు కీలకపాత్రలు పోషించారు. వీటివల్లే జయలలిత మరోసారి అధికారంలోకి వచ్చారని చెబుతారు. వాస్తవానికి ఆ ఎన్నికల సమయంలో కూడా అనారోగ్యం కారణంగా జయలలిత పెద్దగా ప్రచారం చేయలేదు.

జయలలిత లాంటి స్టాల్‌వార్ట్ వద్ద పనిచేసి, ఇప్పుడు శశికళ వద్ద పనిచేయడానికి మనసు ఒప్పకపోవడం వల్లే ఈ ఉన్నతాధికారులందరూ వెళ్లిపోయారని అన్నాడీఎంకేలోని సీనియర్ నాయకులు కొంతమంది చెబుతున్నారు. మరోవైపు కొంతమంది అయితే జయలలితకు స్లో పాయిజనింగ్ చేశారని, అందువల్లే ఆమె తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ఆరోపిస్తున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుడు పాండియన్ సైతం జయది సహజ మరణం కాదని ఆరోపించారు. ఇప్పుడు ఉన్నతాధికారులు వరుసపెట్టి వెళ్లిపోవడం సైతం శశికళకు ఎదురుదెబ్బేనని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు