టాప్ హీరోల భారీ పారితోషికాల వల్లే..!

8 Sep, 2016 12:19 IST|Sakshi
టాప్ హీరోల భారీ పారితోషికాల వల్లే..!

సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా స్టార్ హీరోలు భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. కొన్నిసార్లు సినిమా బడ్జెట్ కు మించి వారి పారితోషికాలు ఉంటున్నాయి.  దీంతో వారితో సినిమాలు తీయాలంటేనే నిర్మాతలకు తడిసి మోపెడవుతోంది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్తా తలకిందులైనా..  నిర్మాతలు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.  ఈ విషయంలో బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేదు. ఈ పరిస్థితిని తట్టుకోలేకనే డిస్నీ ఇండియా భారత్ లో దుకాణం మూసేసింది. హిందీ సినిమాల నిర్మాణం నుంచి తప్పుకొంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

ఈ ప్రకటన నేపథ్యంలో బాలీవుడ్ విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనదైనశైలిలో స్పందించారు. ఎలాంటి మోహమాటం లేకుండా బాలీవుడ్ అగ్రహీరోలను ఈ విషయంలో ఎండగట్టారు. ' షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి నటులు తమ పని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పారితోషికాన్ని తీసుకుంటున్నారు. దీంతో వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడితే నిర్మాతల పరిస్థితి ఘోరంగా మారిపోతున్నది.

ముందే పారితోషికాలు తీసుకుంటుండటంతో సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా హీరోలు సులభంగా బయటపడుతున్నారు. దీనివల్ల ఒక్క డిస్నీయే కాదు భారత్ లోని చాలా నిర్మాణ సంస్థలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. మున్ముందు మరిన్ని ప్రొడక్షన్ హౌస్ లు మూతపడుతున్నాయి' అని ఆయన ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పేర్కొన్నారు. హాలీవుడ్ లో పారితోషికం పెద్ద విషయం కాదని, కానీ బాలీవుడ్ లో నటులు తమకు చెల్లింపులు అయిన తర్వాత నటించడానికి ఒప్పుకొంటారని, ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు