మార్షల్స్‌ మాపై దాడి చేస్తారా..?

9 Sep, 2016 10:08 IST|Sakshi
మార్షల్స్‌ మాపై దాడి చేస్తారా..?

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది. 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ప్రకటన చేసి తర్వాత.. విపక్షాన్ని మాట్లాడనీయకుండా చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌ రెడ్డి మండిపడ్డారు. పోడియం వద్ద తాము శాంతియుతంగానే ఆందోళన చేశామని ఆయన తెలిపారు. మార్షల్సే తమపై దాడి చేశారన్నారు. మార్షల్స్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.

అబద్ధాలు, అవాస్తవాలతో పుట్టిన పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. మార్షల్స్‌ తమపై దాడి చేస్తారా..అని ఆయన ప్రశ్నించారు. దాడి చేసే అధికారం మార్షల్స్‌కు ఎక్కడిదని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ నిరంతర పోరాటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాసే చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి మేలు జరిగేంత వరకు ప్రజల పక్షాన నిలబడతామని చెవిరెడ్డి అన్నారు.


మార్షల్స్‌ పై దాడి చేశారనడం పచ్చి అబద్ధమని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. విభజన హామీలపై చర్చ అంటే ప్రభుత్వం భయపడుతోందన్నారు. ప్రత్యేక హోదాపై ముందు చర్చ జరగాలని సూచించారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు గమనించాలన్నారు. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతోందని విశ్వేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. తామేమైనా దొంగలమా, లేక రౌడీలమా అంటూ.. ఎందుకు మార్షల్స్ను పెట్టారని ధ్వజమెత్తారు. తాము చేసే పోరాటం ప్రత్యేక హోదా కోసమే అన్నారు.

ప్రత్యేక హోదా వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

ఓటుకు కోట్లు కేసు వల్లే బాబు హోదాను తాకట్టు పెట్టారు: ఎమ్మెల్యే సునీల్‌

చంద్రబాబుకు పదవులపైనే ఎక్కువ ఆశ:ఎమ్మెల్యే నారాయణ స్వామి

ఇద్దరు కాంట్రాక్టర్లను కేంద్రం వద్దకు పంపించి, ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు. కేంద్రం ప్రకటనను బాబు ఎలా స్వాగతిస్తారు: ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా

మరిన్ని వార్తలు