ఇవేం అరాచకాలు?

5 Feb, 2016 08:53 IST|Sakshi
ఇవేం అరాచకాలు?

* బతికున్న మనిషిని చనిపోయినట్టు ధ్రువీకరించడమేమిటి?
* క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది
* ప్రజాస్వామ్యంలో ఇటువంటి తీరు వాంఛనీయం కాదు
* పిటిషనర్ పెన్షన్ ఎందుకు రద్దుచేశారో...
* చనిపోయినట్టు ఎలా ధ్రువీకరించారో తెలపాలని ఆదేశం


సాక్షి, హైదరాబాద్: ‘రక్త మాంసాలతో బతికున్న మనిషి చనిపోయినట్టు ధ్రువీకరించడమేమిటి..ఇవేం అరాచకాలు? అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?’  అంటూ జన్మభూమి కమిటీల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తను బతికున్నప్పటికీ చనిపోయినట్టు నిర్ధారించి తన పెన్షన్ రద్దు చేసిన జన్మభూమి కమిటీ తీరుపై అమ్మణ్ణమ్మ అనే ఓ వృద్ధ మహిళ న్యాయపోరాటానికి దిగింది. బతికున్నానని చెప్పినా, ఆధారాలు చూపినా జన్మభూమి కమిటీ పట్టించుకోకపోవడంతో ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.   అలాగే మెట్ట లక్ష్మి అనే ఓ వితంతు మహిళ కూడా తను వితంతువు కాదంటూ పెన్షన్ రద్దు చేశారని వివరిస్తూ స్వయంగా కోర్టు ముందుకొచ్చి అన్ని ఆధారాలను సమర్పించారు. మరో 75 మంది కూడా ఇదేవిధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

వీటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి దేని ఆధారంగా పిటిషనర్లకు పెన్షన్‌ను రద్దు చేశారో, దేని ఆధారంగా చనిపోయినట్టు ధ్రువీకరించారో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ... రాజకీయ కారణాలతో పిటిషనర్ల పెన్షన్లు రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అప్పీల్ తీసుకునేందుకు సైతం ఎంపీడీవో తిరస్కరించి, అధికార పార్టీ నేతలు చెబితేనే తీసుకుంటానని చెప్పారన్నారు.

ఈ సమయంలో అమ్మణ్ణమ్మ కోర్టు ముందుకొచ్చి తను బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్టు ధ్రువీకరించి పెన్షన్‌ను రద్దు చేశారని తెలిపారు. వితంతువైన లక్ష్మి కూడా కోర్టు ముందుకొచ్చి ఆధారాలను చూపారు. న్యాయమూర్తి వాటిని ఆంధ్ర ప్రాంత జడ్‌పీపీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీల తరఫు న్యాయవాది చీమలపాటి రవికి ఇచ్చారు. ‘‘ఆ వృద్ధ మహిళను చూస్తే ఆమె పెన్షన్‌కు అర్హురాలని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. మీ అధికారులకు మాత్రం కనిపించడంలేదు. భౌతికంగా చూసీ వృద్ధుడు కాదంటారు.

ధ్రువీకరణ పత్రం ఇచ్చినా అంగవైకల్యం లేదు, పెన్షన్ రాదంటారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి తీరు వాంఛనీయం కాదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. కోర్టు దృష్టికి వస్తున్నవి సముద్రంలో నీటి చుక్క మాత్రమే. ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఇలా చేస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్న వారు రేపు అధికారంలోకి వస్తే వారూ మిమ్మల్ని చూసి ఇలానే చేయవచ్చు. అంతిమంగా ఇబ్బందిపడేది అమాయకపు ప్రజలే’’ అని న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఉపలోకాయుక్త ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరించాలన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని రవి కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు