‘ఏపీ స్థానికత’కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

19 Jan, 2016 04:06 IST|Sakshi
‘ఏపీ స్థానికత’కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగులతో పాటు ఇతరులు, వారి పిల్లలకు స్థానికత కల్పించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంబంధిత ఫైలును న్యాయ శాఖ పరిశీలనకు పంపింది. న్యాయ శాఖ ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకపోతే వీలైనంత త్వరలో స్థానిక హోదా కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడతాయని అధికార వర్గాలు తెలిపాయి.

 

న్యాయ శాఖ పరిశీలన అనంతరం మళ్లీ ఫైలు కేంద్ర హోంశాఖకు చేరుతుందని, కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర విభజన తేదీ జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే కుటుంబాలందరికీ స్థానికత కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 7న కేంద్రాన్ని కోరింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుది ముసాయిదా తీర్మానాన్ని కేంద్రానికి సమర్పించింది. అనంతరం కేంద్రం అడిగిన పలు వివరణలు ఇవ్వడంతో పాటు , రాష్ట్రపతి ఉత్తర్వులకు కొన్ని సవరణలు కూడా సూచించింది. ఈ సవరణలు ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడి నుంచైనా ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి వలస వెళ్లినప్పటికీ స్థానికత వర్తించనుంది.

>
మరిన్ని వార్తలు