పక్కాగా ‘వెరిఫై’ చేస్తారు!

29 Sep, 2015 09:25 IST|Sakshi
పక్కాగా ‘వెరిఫై’ చేస్తారు!

సాక్షి, హైదరాబాద్: నూతన రాష్ట్రం, రాజధాని ప్రాంతం కావడంతో కొత్తగా ప్రైవేట్ సంస్థలు వచ్చి రిక్రూట్‌మెంట్ చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకూ చెందిన వారు ఉద్యోగాల కోసం వచ్చే అవకాశం ఉంది. వీరిలో నేరచరితులు ఉంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.

ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అత్యాధునిక ‘వెరిఫికేషన్’ సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. దీన్ని వినియోగించడం ద్వారా ఏదైనా సంస్థ రూ. 500 రుసుము చెల్లించి తమ వద్ద ఉద్యోగంలో చేరే వారి గత చరిత్రను వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఈ విధానం ఇప్పటికే అమలులో ఉన్నా సరిగా సాగట్లేదు.

వెరిఫై సాఫ్ట్‌వేర్ రూపొందించాలని నిర్ణయించిన పోలీసు విభాగం ప్రాథమికంగా కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోనుంది. తద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 2,300 కోర్టులకు సంబంధించిన ఐదున్నర కోట్ల రికార్డులతో కూడిన డేటాబేస్‌తో అనుసంధానం చేసుకుంటారు. ఆయా న్యాయస్థానాల్లో ట్రయల్ పెండింగ్, ట్రయల్ దశ, వీగిపోయిన, శిక్షపడిన, రాజీ కుదిరిన కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో పోలీసు విభాగానికి అందుబాటులోకి వస్తాయి. దీని ఆధారంగా ‘వెరిఫై’ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తారు.

ఈ డేటాబేస్‌ను అన్ని పోలీసుస్టేషన్లకూ కనెక్టివిటీ ఉండేలా ఇంట్రానెట్‌తో అనుసంధానిస్తారు. తద్వారా ఓ నేరం జరిగినప్పుడు ఆ తరహా నేరాలు చేసే వారు, గతంలో పలుసార్లు చేసిన వారు ఎవరు ఉన్నారు? వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? తక్షణం తెలుసుకోవడంతో పాటు డేటా నుంచే వారి ఫొటో, చిరునామా, వేలిముద్రలు కూడా సంగ్రహించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

అందరికీ ఉపయుక్తకరం...
పూర్తిస్థాయిలో అప్‌డేట్ అయిన ‘వెరిఫై’ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వస్తే పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి తక్షణం వాటిని అందించే అవకాశం ఏర్పడుతుంది. దీని కంటే ముఖ్యంగా ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నివేదికలు రూపొందించి దరఖాస్తుదారులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రైవేటు కంపెనీలకు సమర్పించే అవకాశం ఉంటుంది.

బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డులుగా, పని మనుషులుగా, డ్రైవర్లుగా చేరే వారు పలు నేరాలు చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి వారిలో అత్యధిక శాతం నేర చరిత్ర కలిగిన వారే ఉంటున్నారు. ‘వెరిఫై’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే యజమానులు సైతం పోలీసులను ఆశ్రయించి తమ వద్ద ఉద్యోగాల్లో చేరే వారి వివరాలను సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.

మరిన్ని వార్తలు