గడ్చిరోలి ఎన్కౌంటర్ బూటకం: ఏపీసీఎల్సీ

24 Feb, 2014 15:12 IST|Sakshi

గత వారం గడ్చిరోలిలో జరిగినది బూటకపు ఎన్కౌంటర్ అని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల కమిటీ మండిపడింది. ఆ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈనెల 18వ తేదీన మావోయిస్టులకు, సి-60 కమాండో దళాలకు కోర్చి తాలూకా బెట్కార్తి గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. అనంతరం ఏపీసీఎల్సీ నిజ నిర్ధారణ బృందం అక్కడకు వెళ్లి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ బృందంతో కలిసి సంఘటనపై విచారణ జరిపింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఏపీసీఎల్సీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు.

ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులను పోలీసులు ఓ వాహనంలో తెచ్చారని, అప్పటికే వాళ్లకు విషం ఇచ్చారని, ఆ తర్వాత దగ్గరనుంచి కాల్చి చంపారు తప్ప పోలీసులు కథ అల్లుతున్నట్లుగా అక్కడ ఎన్కౌంటర్ ఏమీ జరగలేదని అన్నారు. సంఘటన స్థలంలో ఎక్కడా బుల్లెట్ల ఆనవాళ్లు లేవని, అలాగే మృతదేహాలకు పంచనామా చేయడం గానీ, స్థానిక మీడియాకు చెప్పడంగానీ జరగలేదని ఆయన ఆరోపించారు. మృతదేహాలను నేరుగా గడ్చిరోలి ప్రభుత్వాస్పత్రికి తెచ్చారన్నారు. ఆ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదుచేసి, జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు