రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్

27 Jul, 2015 21:03 IST|Sakshi
రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్

సామాన్యుల కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడు పేపర్ బాయ్గా పనిచేశారు. కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించారు. సైంటిస్టుగా కెరీర్ ఆరంభంచి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. దేశానికి వెలకట్టలేని సేవలు అందించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న స్వీకరించారు. దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠం అధిరోహించారు.  రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఏపీజే అబ్దుల్ కలాం ప్రస్థానమిది. కోట్లాది మంది స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ కలాం ఇకలేరు. సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కానీ ఆయన ఆశయాలు, కలలు ఎప్పటికీ బతికే ఉంటాయి. కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోడానికి కష్టపడాలని పిలుపునిచ్చిన ఏకైక దార్శనికుడు అబ్దుల్ కలాం. అలాగే, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత మళ్లీ పిల్లలకు అంత చేరువగా వెళ్లిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. ఆయన స్ఫూర్తితో అనేకమంది అంతరిక్ష శాస్త్రవేత్తలు భారతదేశంలో వచ్చారు. ఇస్రో, డీఆర్డీఓ, షార్ తదితర కేంద్రాల్లో ఇప్పటికీ ఆయన శిష్యులు, ప్రశిష్యులే కీలక పాత్రలు పోషిస్తున్నారు. రక్షణ రంగంలో పరిశోధనలు చేసిన ఆయన.. కేర్ ఆస్పత్రికి చెందిన సోమరాజుతో కలిసి హృద్రోగులకు అమర్చే స్టెంట్ల రూపకల్పనలో కూడా కీలకపాత్ర పోషించారు. కలాం జీవితంలో కీలక ఘట్టాలు..


పూర్తి పేరు: ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం
జననం: 1931 అక్టోబరు 15, రామేశ్వరం (తమిళనాడు)
వయసు: 84
తల్లిదండ్రులు: అషియమ్మ, జైనులబుద్దీన్

విద్య

పాఠశాల విద్య: రామనంతపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్
కాలేజీ విద్య: తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫిజిక్స్లో డిగ్రీ, మద్రాసులో ఏరోస్పేస్ ఇంజినీరింగ్

సైంటిస్టుగా కెరీర్

ఉద్యోగం: 1960లో డీఆర్డీఓలో సైంటిస్టుగా చేరిక
ఇస్రోతో అనుబంధం: 1969లో ఇస్రోకు బదిలీ, ఎస్ఎల్వీ-3 ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరణ.
1990 వరకు ఇస్రోలో వివిధ హోదాల్లో బాధ్యతలు, పీఎస్ఎల్వీ, ఎస్ఎల్వీ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర
డీఆర్డీఓ: 1992-99 మధ్య డీఆర్డీఓ సెక్రటరీగా బాధ్యతలు
ప్రధాని సాంకేతిక సలహాదారుగా బాధ్యతలు
కలాం సారథ్యంలో ప్రోక్రాన్-2 అణుపరీక్షల నిర్వహణ

రాష్ట్రపతి పదవీకాలం: జూలై 25, 2002-జూలై 25, 2007

రచనలు: వింగ్స్ ఆఫ్ ఫైర్

అవార్డు: భారతరత్న

మరిన్ని వార్తలు