యాపిల్ యాప్స్టోర్పై హ్యాకర్ల దాడి!

21 Sep, 2015 10:21 IST|Sakshi
యాపిల్ యాప్స్టోర్పై హ్యాకర్ల దాడి!

శత్రుదుర్భేద్యంగా భావించే యాపిల్ కంపెనీ వాళ్ల యాప్ స్టోర్లోకి హ్యాకర్లు చొరబడ్డారు. ఈ విషయాన్ని యాపిల్ కూడా నిర్ధారించింది. తమ డెవలపర్లు ఉపయోగించే ఒక టూల్ను హ్యాకర్లు కాపీచేసి, దానికి మార్పుచేర్పులు చేసి, యాప్ స్టోర్లో అందుబాటులో ఉండే యాప్స్లోకి వాళ్ల కోడ్ను ప్రవేశపెట్టారని యాపిల్ చెప్పింది. ఇప్పటివరకు 40 యాప్స్లో ఇలాంటి కోడ్ లేదా మాల్వేర్ ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల కోట్లాది మంది యాపిల్ యూజర్లపై ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. ఉదాహరణకు యాప్ స్టోర్లో ఉండే 'వుయ్ చాట్' లాంటి యాప్ను తీసుకుంటే.. దానికి దాదాపు 50 కోట్ల మంది యూజర్లున్నారు. అలాగే కామ్ కార్డ్ అనే బిజినెస్ కార్డ్ స్కానర్ యాప్లోనూ ఈ మాల్వేర్ ఉంది.

దాదాపు 300 వరకు యాప్స్ ఇలా ఇన్ఫెక్ట్ అయ్యాయని చైనాకు చెందిన ఆన్లైన్ సెక్యూరిటీ కంపెనీ క్యోహో తెలిపింది. నకిలీ సాఫ్ట్వేర్తో మార్చినట్లు గుర్తించిన కొన్ని యాప్లను తాము ఇప్పటికే తొలగించామని యాపిల్ అధికార ప్రతినిధి క్రిస్టీన్ మొనాగన్ తెలిపారు. అయితే ఆదివారం నాడు ఎంతమంది ఇలా ఇన్ఫెక్ట్ అయిన యాప్లను డౌన్లోడ్ చేసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కసారి ఇలా మాల్వేర్ ఉన్న యాప్ను ఓపెన్ చేశారంటే.. ఆ ఫోన్ లేదా ట్యాబ్లోకి మరిన్ని వైరస్లు ప్రవేశించే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని వార్తలు