యాపిల్ కు మరో బ్యాడ్ న్యూస్

12 Jul, 2016 10:55 IST|Sakshi
యాపిల్ కు మరో బ్యాడ్ న్యూస్

శాన్ ఫ్రాన్సిస్కో :  ఇప్పటికే  ఐఫోన్ అమ్మకాల పడిపోయి నిరాశలో ఉన్న యాపిల్ కు మరో బ్యాడ్ న్యూస్. గ్లోబల్ గా యాపిల్ ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ కంప్యూటర్ల అమ్మకాలు పడిపోయాయట. గతేడాదితో పోలిస్తే 2016 రెండో త్రైమాసికంలో మ్యాక్ కంప్యూటర్ల అమ్మకాలు 4 నుంచి 8శాతం క్షీణించాయని రీసెర్చ్ సంస్థలు వెల్లడించాయి. అదేవిధంగా యాపిల్ మేజర్ ప్రత్యర్థులు మాత్రం పీసీ వ్యాపారాల్లో వృద్ధిని బాగానే నమోదుచేశాయని తెలిపాయి.   

స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ల జోరుతో పీసీ మార్కెట్ పడిపోతున్నప్పటికీ, 2014-15 కాలంలో యాపిల్ తన మ్యాక్ కంప్యూటర్ అమ్మకాలను స్థిరమైన పెరుగుదలను సాధిస్తూ మార్కెట్ ను ఎంజాయ్ చేసింది. కానీ గతేడాది చివరి నుంచి మ్యాక్ యూనిట్ల అమ్మకాలు తిరోగమనంలో పడిపోయాయి. ఈ విషయాన్ని యాపిల్ ఇంకే స్వయంగా తన రిపోర్టులో పేర్కొంది. జూన్ త్రైమాసికం ముగింపు వరకు మ్యాక్ అమ్మకాలు 44లక్షల నుంచి 46 లక్షల వరకు పడిపోయాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గ్లోబల్ గా స్మార్ట్ ఫోన్, గాడ్జెట్ ల జోరుతో, పీసీ వ్యాపారాలు గత నాలుగేళ్లుగా పతనమవుతూ వస్తున్నాయి. గ్లోబల్ గా గత త్రైమాసికంలో పీసీల సరుకు రవాణా 624 లక్షల వరకు పడిపోయింది. ఈ పతనం గతేడాదితో పోలిస్తే 4.5శాతం అధికమని ఇంటర్ నేషనల్ డేటా కార్పొరేషన్ విశ్లేషకులు పేర్కొన్నారు. పీసీ తయారీ దిగ్గజంగా ఉన్న లెనోవా కూడా తన సరుకు రవాణాను 2శాతం కోల్పోయింది.

అయితే హెచ్ పీ, డెల్, ఏస్ యూఎస్ మాత్రం గత త్రైమాసికంలో తమ సరుకు రవాణా వృద్ధిని పెంచుకున్నాయని రీసెర్చ్ సంస్థలు వెల్లడించాయి. ఆరోగ్యకరమైన అమెరికా మార్కెట్, గూగుల్ క్రోమ్ సాప్ట్ వేర్ తో నడిచే కొత్త ల్యాప్ టాప్ లపై వినియోగదారుల ఆసక్తి, సీజనల్ కొనుగోలులు వాటి పీసీ మార్కెట్ల వృద్దికి దోహదం చేశాయని వెల్లడించాయి. ఎనిమిది వరుస త్రైమాసికాల్లో మ్యాక్ కంప్యూటర్ల జోరును కొనసాగించిన యాపిల్ కు, ఐఫోన్ల దెబ్బ, పీసీ ల దెబ్బ రెండూ తలనొప్పులుగా మారుతున్నాయి.

మరిన్ని వార్తలు