నమ్మనివారే ఫూల్స్‌!

5 Apr, 2017 22:26 IST|Sakshi
నమ్మనివారే ఫూల్స్‌!

ఏప్రిల్‌ 1 రోజున బంధువులను, స్నేహితులను సరదాగా ఆటపట్టిస్తుంటారు. సన్నిహితులను  సరదాగా ఆటపట్టించేందుకుగాను సంవత్సరంలో ఒకరోజు కేటాయించారు పెద్దలు. కానీ ఆ రోజు అన్ని సరదా కోసమే చేస్తారనుకోవద్దు, కొన్ని నిజమైనప్పటికీ మనం నమ్మం. నిజంగా ప్రమాదాలు ముచ్చుకొస్తున్న సంగతిని సన్నిహితులు చెప్పినప్పటికి ఇది ఫూల్స్‌ చేయడానికే అనుకోని ప్రమాదాల బారినపడ్డ సంగతులు కోకొల్లలు. అంతేకాదు బంపర్‌ ఆఫర్స్‌ వరించిన వారుకూడా ఫూల్స్‌ చేస్తున్నారన్న కారణంతో వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి కొన్ని సంగతులను ఈ రోజు తెలుసుకుందాం.....!  

అయితే ఫూల్‌.. లేకుంటే కారు....
ఏప్రిల్‌ 1, 2015.. న్యూజిలాండ్‌...  ఉదయం లేచి పేపర్‌ చూసిన ప్రజలకు బీఎండబ్ల్యూ ప్రకటన కనబడింది. దాంట్లో ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భంగా మీ పాత కారును తీసుకొచ్చి కొత్త బీఎండబ్ల్యూ కారును తీసుకెళ్లండని ప్రకటన వచ్చింది. కానీ అక్కడి ప్రజలు ఈ ప్రకటనను నమ్మి షోరూంకి వెళితే ఫూల్స్‌ అయిపోతామని ఎవరూ వెళ్లలేదు. టీనా మార్షా మాత్రం ఈ ప్రకటనను నమ్మింది. ప్రయత్నిస్తే వచ్చే నష్టం ఏమిలేదనుకున్న టీనా షోరూంకి వెళ్లింది. అయితే ఫూల్‌ లేదంటే బీఎండబ్ల్యూ కారుతో తిరిగొస్తానన్న నమ్మకంతో వెళ్లింది. మొదటగా బీఎండబ్ల్యూ బొమ్మకారును ఇస్తారనుకున్న టీనాకు షోరూం సిబ్బంది అశ్చర్యానికి గురిచేస్తూ 33 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును అందించారు.  షోరూంకి తన 15 ఏళ్ల పాత నిస్సాన్‌ కారుతో వెళ్లినా టీనా కొత్త బీఎండబ్ల్యూ కారుతో ఇంటికి తిరిగొచ్చింది.

ప్రభుత్వ హెచ్చరికను నమ్మలేదు....
ఏప్రిల్‌ 1, 1946కు రెండు, మూడు రోజుల ముందు నుంచి ఐస్‌లాండ్‌లో సునామీ వస్తుందని ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తోంది ప్రభుత్వం. ఇదంతా మమ్మల్ని ఫూల్స్‌ చేయడానికే అని భావించారు అక్కడి ప్రజలంతా. ప్రభుత్వాన్నే ఫూల్స్‌ చేయాలనుకొని ఎవరూ ఇళ్లు ఖాళీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్‌ 1 తెల్లవారుజామున భయంకర శబ్ధాలు వినబడడంతో తన అన్న చెప్పింది నిజమనే నమ్మాడు ఓ వ్యక్తి.  తెల్లవారుజామున 2 గంటలకు భయంకర సునామీ ప్రజల మీదకు విరుచుకుపడింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రజలందరూ పరుగు లంకించుకున్నారు. కొందరు ప్రాణాలతో బయటపడితే మరికొందరు ప్రాణాలు విడిచారు.  దీనిలో దాదాపు 1300 ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా 159 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం మాటను పెడచెవిన పెట్టడంతో భారీ ఎత్తున నష్టపోవడంతోపాటు అపార ప్రాణనష్టంకూడా సంభవించింది. ఏప్రిల్‌ 1న ఫూల్స్‌ అవుతామన్న భావనతో ప్రభుత్వ హెచ్చరికను లెక్కచేయని కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి. కొందరు కుటుంబ సభ్యులను కోల్పోతే మరికొందరు గూడులేక రోడ్డున పడ్డారు.

మార్విన్‌ గయే హత్య...
ఏప్రిల్‌ 1, 1984న అమెరికాలోని ప్రముఖ గాయకుడు మార్విన్‌ గయేను తన తండ్రే హత్య చేశాడన్న వార్త దావనంలా వ్యాపించింది. కానీ దీన్ని అక్కడి ప్రజలేవరూ నమ్మలేదు. ఎందుకంటే ఆ రోజు ఫూల్స్‌ డే సందర్భంగా కావాలనే ఎవరో ఈ కట్టుకథ అల్లారని అనుకున్నారు. ఒక ఇన్సూరెన్సు పాలసీ డాక్యుమెంట్‌ విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. చిన్నగా ప్రారంభమైన గొడవ పెద్దగా తయారైంది. మొదట మార్విన్‌ తన తండ్రిపై చేయిచేసుకున్నాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన మార్విన్‌ తండ్రి తన దగ్గర ఉన్న పిస్తోల్‌తో మార్విన్‌ చాతీపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో పడిఉన్న మార్విన్‌ను సన్నిహితులు ఆసుపత్రికి చేర్చేలోపే తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను ప్రజలు మొదట నమ్మలేదు.

జీమెయిల్‌ ఒక జోక్‌
ఇప్పుడు మనం జీమెయిల్‌ లేని ప్రపంచాన్ని ఊహించలేం. జీమెయిల్‌ లేకుండా ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఇది నేటి పరిస్థితి... ఏప్రిల్‌ 1, 2004న గూగుల్‌ జీమెయిల్‌ లాంచ్‌ చేస్తున్నప్పుడు అందరూ దాన్నొక జోక్‌గా అనుకున్నారు. దీని యొక్క స్టోరేజ్‌ కెపాసీటీ 1 గిగాబైట్‌గా గూగుల్‌ చెబుతుంటే అందరూ నవ్వుకున్నారు. కానీ నేడు జీమెయిల్‌ అవసరం ప్రపంచానికి ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 – సాక్షి స్కూల్‌ ఎడిషన్‌

మరిన్ని వార్తలు