భారీగా ఆర్టీసీ చార్జీల పెంపు

5 Nov, 2013 01:32 IST|Sakshi
భారీగా ఆర్టీసీ చార్జీల పెంపు

* నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి..  ప్రజలపై 600 కోట్ల మోత
* కి.మీ.కి 4 -20 పైసల వరకు పెంపు
* 9.5% వరకూ పెరిగిన టికెట్ల ధరలు
* పల్లె వెలుగు బస్సులనూ వదల్లేదు
* కనీస చార్జీలు యథాతథం.. రెండో స్టేజీ ప్రయాణానికి భారీగా వడ్డన
* బస్‌పాస్‌ల ధరలూ పెంపు..
* నాలుగేళ్లలో 60% పెరిగిన చార్జీలు
 
 సాక్షి, హైదరాబాద్:  సామాన్యుడి జేబుకు ప్రభుత్వం మళ్లీ చిల్లు పెట్టింది. ఇప్పటికే ధరల పెరుగుదలతో నడ్డి విరిగిన సగటు జీవిపై ఆర్టీసీ బస్సు చార్జీల మోత మోగించింది. అన్నిరకాల బస్సు సర్వీసుల్లో కలిపి సగటున 9.5 శాతం మేర టికెట్ల ధరలు పెంచేసింది. పేదలకు దిక్కయిన పల్లె వెలుగు దగ్గరి నుంచి లగ్జరీ బస్సుల దాకా భారీగా వడ్డించింది. కనీస  చార్జీని పెంచలేదంటూనే.. దొడ్డిదారిన దోచుకోవడానికి రంగం సిద్ధం చేసింది. పెంచిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో ఇటీవలి ఉద్యమాల కారణంగా ఏర్పడ్డ నష్టాన్ని పూడ్చుకునేందుకు చార్జీలను పెంచాలన్న ఆర్టీసీ ప్రతిపాదనలకు ప్రభుత్వం సోమవారం పచ్చజెండా ఊపింది. ఆర్టీసీ ప్రతిపాదించిన స్థాయిలోనే పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో ప్రజలపై ఏటా రూ. 600 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. అయితే, నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించడానికి ఎన్నో మార్గాలుండగా.. కిరణ్ ప్రభుత్వం చార్జీలు పెంచడానికే నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ నుంచి వసూలు చేస్తున్న పన్నులను మాఫీ చేయడం ద్వారానో, తాత్కాలిక విరామం ప్రకటించటం ద్వారా నో.. ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన ప్రభుత్వం.. ప్రజల నెత్తిన భారం వేయడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 పెంపు ఇలా..
 ప్రతి కిలోమీటరు దూరానికి పల్లె వెలుగు బస్సుల్లో 4 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లో 7, డీలక్స్‌లో 9, సూపర్ లగ్జరీ బస్సుల్లో 11, ఇంద్రలో 12, గరుడపై 20, గరుడ ప్లస్ బస్సుల్లో 15 పైసల చొప్పున పెంచారు. ఫలితంగా పల్లె వె లుగు బస్సుల్లో ప్రతి కిలోమీటరు ప్రయాణానికి 55 పైసల నుంచి 59 పైసలకు, ఎక్స్‌ప్రెస్‌లో 72 పైసల నుంచి 79 పైసలకు, డీలక్స్‌లో 80 పైసల నుంచి 89 పైసలకు, సూపర్ లగ్జరీలో 94 పైసల నుంచి రూ. 1.05కు, ఇంద్రలో రూ. 1.20 నుంచి  రూ.1.32కు, గరుడలో రూ. 1.40 నుంచి రూ. 1.60కు, గరుడ ప్లస్‌లో రూ. 1.50 నుంచి రూ. 1.65కు టికెట్ల ధరలు పెరిగాయి. అత్యంత విలాసవంతమైన వెన్నెల బస్సు చార్జీలను మాత్రం కిలోమీటరుకు రూ. 2.30 గానే ఉంచడం గమనార్హం. కనీస చార్జీ జోలికి వెళ్లకుండా ప్రభుత్వం పేదలపై కొంత కనికరం చూపింది. ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగాకనీస చార్జీ పల్లె వెలుగు బస్సుల్లో రూ. 5, ఎక్స్‌ప్రెస్‌ల్లో రూ. 10, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ. 15, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో రూ. 25, వెన్నెల బస్సుల్లో రూ. 50 యధావిధిగా కొనసాగుతాయి.
 
 వైఎస్ మరణం తర్వాత ఏటా వడ్డింపే..

 ప్రజలపై భారం మోపకుండా పాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏటా చార్జీలు పెంచుతూపోతోంది. గత నాలుగేళ్లలో ఇప్పటికే నాలుగు సార్లు బస్సుల చార్జీల మోత మోగించిన సర్కారు.. తాజాగా ఐదోసారీ వాత పెట్టింది. తాజా పెంపుతో ఈ నాలుగేళ్లలో ఏకంగా 60 శాతం మేర టికెట్ ధరలు పెరగడం గమనార్హం
 
 కనీస చార్జి జోలికి వెళ్లలేదంటూనే..
 తాజా చార్జీల సవరణలో కనీస టికెట్ చార్జీ జోలికి వెళ్లలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కానీ పల్లె వెలుగు నుంచి వెన్నెల సర్వీసు వరకూ కనీస చార్జీ తర్వాత ఉండే రెండో అంచె టికెట్ ధరను భారీగా పెంచటం ద్వారా సగటు ప్రయాణికుడిని దొంగదెబ్బ తీసింది. పేదల బస్సు పల్లె వెలుగునే ఉదాహరణగా తీసుకుంటే.. దాని కనీస చార్జీ రూ.5ను అలాగే ఉంచి... రెండో అంచె టికెట్ ధరను రూ. 6 నుంచి రూ. 7కు పెంచారు. ఈ లెక్కన కనీస చార్జీకి, రెండో అంచెకు మధ్య రూ. 2 వ్యత్యాసం వస్తోంది. 35 కిలోమీటర్లలోపు దూరానికి ప్రతీ అంచెకు రూ. 1 చొప్పున.. ఆపై ప్రతీ అంచెకు రూ. 2 చొప్పున టికెట్ల ధరలు పెంచారు. ఇలా వెన్నెల మినహా.. అన్ని రకాల సర్వీసుల్లో రెండో అంచె చార్జీల్లో భారీగా వడ్డించారు. మొత్తంగా అన్ని తరగతుల ప్రయాణికుల నుంచి భారీగా పిండుకోవటమే లక్ష్యంగా ఈ పెంపు విధానం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజూ 1.40 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వారిలో గ్రామీణ ప్రాంత సర్వీసుల్లో తిరిగే వారి సంఖ్యే ఎక్కువ. పల్లె వెలుగు, సిటీ బస్సుల్లోనే సగటున 75 లక్షల మంది ప్రయాణిస్తారు. తాజా పెంపు వీరిపై ఎక్కువ ప్రభావం చూపబోతోంది. ఇక సిటీబస్సుల్లో 14 కిలోమీటర్ల వరకు రూ. 1, ఆ తర్వాత దూరం ప్రయాణానికి రూ. 2 చొప్పున పెంచారు. ఇక ఈ పెంపుతో ఏర్పడిన రూపాయిలోపు చిల్లర వ్యత్యాసాన్ని సరిచేసేందుకు టికెట్ల ధరలను.. రూపాయల్లోకి సవరిస్తారు.
 
 ఉద్యమాల నష్టాన్ని పూడ్చుకొనేందుకే!
 రాష్ట్రంలో ఇటీవలి ఉద్యమాల ఫలితంగా ఆర్టీసీకి దాదాపు రూ. 800 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దానిని భర్తీ చేసుకొనేందుకు చార్జీలు పెంచక తప్పదని ప్రతిపాదించారు. అయితే, ఆ నష్టాన్ని భర్తీ చేసుకుని ఆర్టీసీని బయటపడేసేందుకు చార్జీలు పెంచాల్సిన అవసరం లేదని, మరెన్నో మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డీజిల్, విడిభాగాల కొనుగోలుపై ఆర్టీసీ వ్యాట్ రూపంలో ఏటా దాదాపు రూ. 700 కోట్లు చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని రీయింబర్స్ చేయటం ద్వారా ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవచ్చు. దాంతోపాటు మోటారు వాహనాల పన్ను రూపంలో ఆర్టీసీ మరో రూ. 450 కోట్లను చెల్లిస్తోంది.

 

ఆర్టీసీ నష్టాలను పరిగణనలోకి తీసుకున్న నాటి సీఎం వైఎస్ 12 శాతంగా ఉన్న ఆ పన్నును 7 శాతానికి తగ్గించారు. అదే తరహాలో ఆ పన్నును మరికొంత తగ్గించటం ద్వారానో, ఒకటి రెండేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారానో ఆర్టీసీని ఆదుకోవచ్చు. ఇక బస్‌పాస్‌ల రూపంలో ఇచ్చే రాయితీని రీయింబర్స్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకొంటున్నా... అందులో ఏయేటికాయేడు ఎగనామం పెడుతూనే ఉంది. ఫలితంగా ఇప్పటికే రూ. 1,000 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించటం ద్వారా కూడా ఆర్టీసీకి చేయూతనిచ్చేందుకు అవకాశముంది. కానీ, కిరణ్ ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ గాలికి వదిలేసి, ప్రజల నడ్డి విరిచేందుకే సిద్ధమైంది.
 
 బస్‌పాస్‌ల ధరలూ భగ్గు..
 అన్ని రకాల బస్సు చార్జీలతో పాటు బస్సు పాస్‌ల ధరలనూ భారీగా పెంచారు. ఒక్క విద్యార్థులు మినహా మిగతా కేటగిరీలకు చెందిన అన్ని రకాల పాస్‌ల ధరలను సవరించారు. ఎన్జీవో పాస్‌లపైనా వడ్డించారు. సాధారణ ప్రయాణికులకు సంబంధించి... సిటీ ఆర్డినరీ పాస్ ధరను రూ. 650 నుంచి రూ. 700కు, మెట్రో పాస్ రూ. 750 నుంచి రూ. 800కు, మెట్రో డీలక్స్ పాస్ రూ. 850 నుంచి రూ. 900కు, సిటీ శీతల్ పాస్ రూ.1,600 నుంచి రూ. 1,750కి, ఎయిర్‌పోర్టు మెట్రో బస్సు పాస్ ధరను రూ. 950 నుంచి రూ. 1,050కి పెంచింది. అలాగే ఎన్జీవోలకు సంబంధించి.. ఆర్డినరీ పాస్ ధరను రూ. 220 నుంచి రూ. 235కు, మెట్రో పాస్ ధరను రూ. 320 నుంచి రూ. 335కు, మెట్రో డీలక్స్ పాస్‌ను రూ. 420 నుంచి రూ. 435కు, ఎంఎంటీఎస్-ఆర్టీసీ కాంబో పాస్ ధరను రూ. 700 నుంచి రూ. 800కు, ఆర్డినరీ టూ మెట్రో కాంబినేషన్ టికెట్ ధరను రూ. 7 నుంచి రూ. 10కు పెంచారు.
 
 చార్జీలు పెంచొద్దు.. ఆర్టీసీకి సబ్సిడీ ఇవ్వాలి
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపును వామపక్షాలు, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతమవుతోంటే మళ్లీ ఈ పెంపు ఏమిటని సోమవారం వేర్వేరు ప్రకటనల్లో ప్రశ్నించాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న మాట నిజమే అయినా దానికి చార్జీల పెంపు ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డాయి. సిటీ బస్సుల నుంచి ఏసీ బస్సులదాకా అన్ని సర్వీసుల చార్జీలు పెంచి ప్రభుత్వం పేదల నడ్డివిరిచిందని మండిపడ్డాయి. ఆర్టీసీకి సబ్సిడీ ఇచ్చి నష్టాల నుంచి గట్టెక్కించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపు వల్ల ప్రజలపై ఏటా రూ. 600 కోట్లు భారం పడుతుందని, అదే ప్రైవేటు బస్సుల్ని నియంత్రిస్తే ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని నారాయణ వివరించారు. కాగా, ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలెందుకు భారాన్ని మోయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఈ పెంపును తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ అసమర్థత వల్లే చార్జీలు పెంచాల్సి వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

 

 

మరిన్ని వార్తలు